పలకలేని వాళ్ళు పలికితే ఎలావుంటుంది

పలక లేని వాళ్ళు పలికితే ఎలావుంటుంది అని ఎప్పుడయినా ఆలోచించారా? పలకలేనివి ఈ ప్రపంచములో చాలా వున్నవి. పలుకు మానవునికి భగవంతుడిచ్చిన ప్రసాదము. దానిని సద్వినియోగము చేసికోవటం మానవ ధర్మము. మనము పలకగలము కదా అని పలకలేని వాళ్లని అర్ధము చేసికోటము మాన కూడదు. అందుకే ఈ వ్రాత. మనస్సు పెట్టి వింటే వినిపిస్తుంది. మనస్సు తెరిచి చూస్తే కనిపిస్తుంది. అది ఎలా? అయితే వినండి.

ఒక ఆకు రాలుతూ చెప్పింది ఏమంటే ఈ జీవితము శాశ్వతము కాదని.
ఒక పుష్పము వికసిస్తూ పలికిందేమంటే జీవితములో ఒక్క రోజయినా గౌరవంగా బ్రతకమని.
ఒక మేఘము వర్షిస్తూ ఉరిమిందేమంటే చెడుని గ్రహిస్తూ మంచిని పంచమని.
ఒక క్రొవ్వొత్తి కరిగిపోతూ మనస్సులో కదిలించినదేమంటే చివరి వరకు పరులకు సాయము చెయ్యమని.
ఒక వృక్షం చల్లగా చెప్పినదేమంటే తనలాగా కష్టాలలో వున్నా,ఇతరులకు సుఖాలు పంచమని.
ఒక సెలయేరు జలజలా పారుతూ వినిపించినదేమంటే తనలాగే కష్ట సుఖాలకు చలించకుండా కర్తవ్యము నిర్వహించమని.

పండు వెన్నెలలో వెలిగే పున్నమి జాబిల్లి వెలుగుతూ పంచే సందేశము ఏమంటే నా లాగే క్షీణించక ముందు అందరి జీవితాలలో చల్లని తెల్లని వెలుగు పంచమని.

కోయిల పాడుతూ కూసిన దేమంటే కుహూ కుహూ కుహూ అంటూ నాతో కులకండి అని, సంతోషముగా నాతో జత కలపండని.

నెమలి నృత్యము చేస్తూ అందించే సత్యము ఏమంటే నాకు తోడురమ్మని, నాతోపాటు ఆడమని, జీవితములో వినోదము కూడా ఉందని తెలిసికోమని .

ఆవు అంబా అని ఆలాపిస్తే ఏమంటున్నదంటే, నేను మీకు సమీకృత ఆహారాన్ని అందిస్తున్నాను కదా, మరి మీరందరూ నన్ను ఆదరణతో చూడరేమి అని.

సముద్రములో వింత అయిన శోభలతో విహరించే రంగు రంగుల చేపలను చూస్తే అవి మీకు జలాంతర్గాములు నడపమని ఆదేశించింది మేమే కదా, మరి మా జాతి వారిని ఎందుకు సమూలంగా నాశనము చేస్తున్నారు అంటూ అరుస్తూ ఉంటవి.

గాలిలో ఎగిరే గువ్వలను చూస్తే అవి మీకు ఆకాశయానము, అంతరిక్షయానము గురించి తెలిపింది మేమే కదా, మరి మా జాతిని ఎందుకు వేటాడుతున్నారు అని ప్రశ్న వేస్తూ ఉంటవి.

మూగవాడి చూపులో దోబూచులాడేదేమంటే వాక్తపస్స్సు అలవాటు చేసికోమని, నీ వాక్కు వ్యర్ధము చెయ్యొద్దని, కష్టములొ వున్నవారికి నీ పలుకులతో ఊరట కలిగించమని, భగవంతుని కీర్తించమని. ఇవన్నీ సృష్టిలో వింతలూ, విచిత్రాలు.

మరి ఈ సృష్టిని సృష్టించి మనకందిచ్చిన సృష్టికర్త మాట్లాడితే ఎలావుంటుంది--

పరమేశ్వరుడు పలికితే ప్రతిధ్వనించేదేమంటే --
నువ్వు ఎదురు చూసే చూపు నా కోసము మాత్రమే అయితే,
నువ్వు గడిపే ప్రతి క్షణము నా కోసమే అయితే,
నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన నా గురించినదే అయితే,
నువ్వు వేసే ప్రతి అడుగు నా వైపుకే అయితే,
నువ్వు చేసే ధర్మ కార్యము నాకే అనుకొంటే,
నీ నిత్య సంబంధము నాతోనే అని ఒప్పుకుంటే
నీకున్న ప్రాణ స్నేహితుడను, హితుడను నేనేనని ఒప్పందం చేసికుంటే
నేను నీ ఊపిరిగా వుంటాను, నీతోనే వుంటాను, నీతోనే నడుస్తాను,
నీకు దాసోహం అంటూ వుంటాను,
నీవు ఎవరోకాదు నేనేనంటాను
పోదాము నాతో రమ్మంటాను
ఎక్కడికని నీవంటే అనంతములోకంటాను
ఇవి పలకలేనివాళ్ళు, మామూలుగా పలకని భగవాన్, అందించే సత్యాలు.

కపిత్వము తప్ప కవిత్వము తెలియని నా మతికి వినిపించినవి అందరకు ఎందుకు వినిపించడము లేదు? మనస్సులో వున్నబండ రాళ్లను, బయటకు పంపి బండెడు కరుణ నింపుకుంటే తప్పక వినబడతాయి అందరికి. భాషాపటిమ లేని నేను, నా భావాలకు చేతనయిన రూపమిచ్చాను
మరి ఇకమీదట అయినా తరచి చూడండి.
మనస్సుతో వినండి, మనస్సు తెరచి చూస్తూ వుండండి
మరి ఇది నాతో పలికించిన మీకు నా వందనములు.
సెలవా మరి !