Telugu Essays 1-20
- 1. పలకలేని వాళ్ళు పలికితే ఎలావుంటుంది
- 2. అందము ఆనందము
- 3. అసంగత్వము
- 4. ఒక అనామిక ఆక్రందనము
- 5. పెద్దల సుద్దులు
- 6. కడుపే కైలాసము, ఇల్లే వైకుంఠము
- 7. భయము
- 8. మార్పు
- 9. ముహుర్తములు ఏమిటి ఎందుకు అవసరమా
- 10. ముక్తి
- 11. వామన మూర్తి - పౌరాణిక దృష్టి, తాత్విక దృష్టి
- 12. ఒక సుమబాల గోల
- 13. చావు ఎవరినీ చంపదు
- 14. కృష్ణుణ్ణి అర్ధము చేసికోవటం ఎలా ? ఇలా !!
- 15. గ్రహములు మంచివా, చెడ్డవా?
- 16. నేనెవరిని
- 17. నేను చేసానా లేక అది జరిగినదా?
- 18. వైరుధ్యములో దాగిన సత్యము
- 19. పాల సముద్రము/ క్షీర సాగరము
- 20. నా ప్రార్ధన
వైరుధ్యములో దాగిన సత్యము
ఒకే విషయాన్ని రెండు వేర్వేరు విధములుగా చెప్పడము వైరుద్ధ్యము. కానీ వైరుద్ధ్యముగా కనపడిన వాటిని తరచి చూస్తే సత్యము వేరే ఉంటుంది. ఇటువంటి విషయములు హిందూ మతములో కొన్ని కనబడుతూ ఉంటవి. పాశ్చాత్త్యులకు ఈ విషయము తెలియదు. తెలిసికోవాలని కుతూహలము వున్న పాశ్చాత్త్యులు హిందువులను అడుగుతూ వుంటారు. కానీ తెలిసి సమాధానము చెప్పగలిగిన హిందువులు ఎంతమంది వున్నారు?
ఇటువంటి విషయములలో సృష్టి ఒకటి. సృష్టి జరిగినదా లేదా, జరిగితే ఎలా జరిగినది, లేక జరగకుండా జరిగినట్లు కనబడుతున్నదా అనేది ఇక్కడ చర్చనీయాంశము.
సాధారణ మానవునికి సృష్టి జరగలేదని చెపితే చెప్పిన వాడు పిచ్చివాడు అనుకొని నవ్వి వెళ్ళిపోతాడు. ఎందుకంటే కనబడుతున్నది. సుఖదుఃఖములు, చావు పుట్టుకలు, మంచిచెడులు, ఆస్తిపాస్తులు అన్నీ కనబడుతున్నవి కనుక.
ఇక సృష్టి ఎవరు చేశారు, ఎలా చేశారు అనేది ప్రశ్న. పౌరాణికములు(చతుర్ముఖ బ్రహ్మ మొదలయినవి) వదిలితే, శాస్త్రీయముగా వేదసమ్మతముగా ఆలోచించాలి. షుమారుగా ఆరువేల సంవత్సరముల క్రిందట సాంఖ్యులు ప్రతిపాదించిన సిద్ధాంతము ఆధునిక కాలములో శాస్త్రజ్ఞుల దృష్టికి దగ్గరగా ఉంటుంది. బ్రహ్మాండము(అన్ని లోకములు కలిపి) పంచభూతముల నుండి వచ్చినవి. అదే "ప్రధానము" లేదా ప్రకృతి. దీని ప్రకారము పదార్ధము, సృష్టి, విజ్ఞానము అన్నీ వున్నవి. అవే తమో, రజో, సత్వ గుణములు(ఆ క్రమములో). అవన్నీ జడములు. జీవుడు చేతనము. వీరి దృష్టిలో అనేకమంది జీవులు అనేకమయిన చైతన్యములు వున్నవి. వీరు ఈశ్వరుని అంగీకరించరు. వీరికి జీవుడు, జగత్తు రెండూ సత్యములు. ఇది వేదబాహ్యము కనుక అంగీకరించబడదు. ఉపనిషత్తుల ప్రకారము చైతన్యము ఒక్కటే. ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఈ విషయము(చైతన్యము ఒక్కటే అని)(Eddington, the physicist, in his Time, space and gravitation and he also wrote in his book The Nature of the Physical World that "The stuff of the world is mind-stuff". First, all we know of the objective world is its structure, and the structure of the objective world is precisely mirrored in our own consciousness. We therefore have no reason to doubt that the objective world too is "mind-stuff". Dualistic metaphysics, then, cannot be evidentially supported.) అంగీకరించారు.
వేదవ్యాసుడు బ్రహ్మసూత్ర భాష్యములలో “జన్మాదిశ్యయతః” అనే సూత్రములో ఈశ్వరుడు(మాయను తన అధీనములో ఉంచుకొన్న పరబ్రహ్మ) సృష్టిని చేసాడు అని నిరూపించారు. ముండక, చాందోగ్య శ్రుతులు కూడా సృష్టి జరిగిందని, ఎలా జరిగినది, కార్య కారణం సంబంధము(ఈశ్వరునికి, జగత్తుకు) చెప్పబడినది. కానీ ఇది మిధ్యగా మాత్రమే అంగీకరించాలి. ఎందుకంటే నిత్యత్వము లేదు కనుక. నిత్యము కానిది సత్యము కాదు. సత్యము కానిది శాస్త్ర సమ్మతము కాదు. కనిపిస్తున్నది, వ్యవహారమంతా నడుస్తున్నది, కనుక అంగీకరించాలి. దీనిలో అర్థమేమంటే రాత్రి వచ్చిన కల అప్పుడు సత్యము కానీ, మరునాడు లేదా నిద్ర లేచిన వెంటనే అది సత్యము కాదు. అందుకే ఈ ప్రపంచము మిధ్య అని అంగీకరించాలి. ఇది అద్వైత సిద్ధాంతము.
గౌడపాదాచార్యులు మాండూక్య కారికలలో అజాతవాదము ప్రవేశపెట్టి అసలు ఈసృష్టి జరుగలేదని, ఇది కేవలము స్వప్నావస్థలో అందరికి అనుభవము వున్న కలలాగే, ఇది జాగ్రదవస్థలో నడుస్తున్న స్వప్నమని, మనస్సు కల్పించిన కల్పన మాత్రమేనని నిరూపించారు. వున్నదంతా బ్రహ్మపద్దార్ధమే కాని మరేమి లేదు. “సర్వం ఖల్విదం బ్రహ్మ, నేహనానాస్తి కించన”, మొదలయిన శ్రుతివాక్యములు చెప్పినది ఇదే. ఇదే అసలు అద్వైత సిద్ధాంతము. ఇదే పారమార్ధిక సత్యము.
కనుక జిజ్ఞాసువు సృష్టి జరిగిందనుకోవాలా, లేదనుకోవాలా అంటే, జరిగినది కాని వున్నది మిధ్యగా అని చెప్పాలి. ఈశ్వరుడు లేడని చెప్పినా, నీవు ఈశ్వరుడు ఒకటే బ్రహ్మపదార్ధము, తేడా లేదని చెప్పినా, వేదాంత జ్ఞానము లేని వారు, కొద్దిగా వున్నా సాధక స్థితిలో వున్నవారు, దారి తప్పి నడిచే అవకాశము ఉంది. వేదములో చెప్పబడిన కర్మకాండ నశించిపోతుంది. ధర్మము తప్పుతుంది. అంతఃకరణ శుద్ధిరాదు. మనిషి పతనానికి కారణమవుతుంది. అంటే సామాజిక పతనము. కనుక జీవుడు, జగత్తు, ఈశ్వరుడు వేరని నేర్పి, పరిపక్వత చెందిన వారికి అజాతవాదము నేర్పితే అప్పుడు జన్మ సార్ధకమవుతుంది. జన్మరాహిత్యము కలుగుతుంది. కనుక ఈరకంగా ఆలోచిస్తే(సాధకుల విషయములో జరిగినదని, జ్ఞానులకు జరగలేదని చెప్పితే) అద్వైత వేదాంతానికి మూల పురుషు లయిన వ్యాస భగవానుడు చెప్పినదానికి, గౌడపాదా చార్యులు చెప్పిన దానికి మధ్య ఏమీ వైరుధ్యము లేదు.
ఈ రకముగా తాత్కాలికంగా ఒక విషయాన్ని అంగీకరించి, తరువాత మరికొంచెము లోతులో వున్న సత్య నిరూపణను అభ్యుపగమ వాదము అని అంటారు.