అసంగత్వము

అసంగత్వము అంటే సంగత్వము లేకుండా వుండటము. సంగత్వము అంటే విషయాల పైన ఆసక్తి లేదా అనురాగము కలిగి ఉండుట. అది లేకుండా వుండటము అసంగత్వము. విషయాలను లేకుండా చేసికోవటం అసంగత్వము అనిపించుకోదు. విషయాల మధ్యలో వున్నా వాటిపై ఆసక్తి లేకపోవటం మాత్రమే అసంగత్వము. ఇదే ఆత్మ లక్షణము. ఇది తెలిసికోగలిగినప్పుడే ముక్తి.

కృష్ణుడి జీవితము దీనికి నిదర్శనము. అందుకే అందరికి ఆదర్శ ప్రాయుడిగా నిలిచిపోయాడు. కృష్ణుడు చెప్పినట్లు చెయ్యి, రాముడు చేసినట్లు చెయ్యి అంటారు కానీ కృష్ణుడు గీతలో ఎలాచెయ్యలో చెప్పాడు, ఎలా చెయ్యాలో తన జీవితములో చేసి చూపాడు కూడా. తామరాకు మీద నీటి బొట్టులాగా దేనికి అంటుకోలేదు. దేవకీ వసుదేవులకు పుట్టాడు. వారికి దర్శనమిచ్చి, చెయ్యవలసిన కర్తవ్యము చెప్పి మామూలు పసిబిడ్డలాగా మిగిలిపోయాడు. దేవకీ వసుదేవులతో బంధమేమి లేదు. వారికి బిడ్డగా పుడతానని ఇచ్చిన మాట ప్రకారము తన అవ్యక్త స్వరూపము నుండి చతుర్భుజుడిగా వ్యక్తమయ్యాడు. యశోద బిడ్డ లాగా పెరిగాడు. యశోద కృష్ణుడు నా బిడ్డ అనుకొంది కానీ కృష్ణుడు తన తల్లి అనే భావన పెంచుకోలేదు. లేకుంటే పన్నెండు సంవత్సరాల వయస్సులో అక్రూరుడు కంస మామ దగ్గరకు తీసికు వెళ్ళటానికి వచ్చినప్పుడు తల్లిని ఓదార్చి రథమెక్కి పోయాడు వెనుదిరిగి చూడకుండా. మళ్ళీఎప్పుడు బృందావనం రాలేదు ఆమెను చూడటానికి రాలేదు. యశోదకు తానెవరో తెలిపాడు కానీ మళ్ళీ మాయలో పడేసాడు. గోపికలతో ఆడాడు, పాడాడు, బోధించాడు కానీ మధురలో అడుగు పెట్టిన తరువాత వాళ్ళను చూడలేదు, తలచలేదు. తనదయిన రాజ్యాన్ని అంటుకోకుండా తాతగారికి కట్టబెట్టాడు. మధురనుండి ద్వారకకు మకాము మార్చాడు, మధుర మీద మమకారమే లేకుండా. ద్వారక మునిగిపోయే సమయానికి బయటకు వచ్చి సముద్రతీరానికి వచ్చి కూర్చున్నాడు. ఎవరిని రక్షించే ప్రయత్నమూ చెయ్యలేదు. భార్యల మీద కానీ, పుత్రుల మీద కానీ మమకారము చూపలేదు. ఈ పనులలో ఎక్కడా కూడా నాది, నావాళ్లు అనే మమకారము చూపలేదు. వాళ్ళను రక్షించాలని ప్రయత్నము ఏమిచెయ్యలేదు. కారణమేమంటే జరగవలసింది జరుగుతుంది, దాన్ని అనుసరించి మనజీవితము గడుపుకోవాలి అని అందరకు నేర్పడానికి. ఎక్కడా బంధము లేదు. ప్రతి చోటా, ప్రతివారితోను కర్తవ్యమే కానీ, మమకారము లేదు. కరుణయే గాని కన్నీళ్లు లేవు. బరువులు మోశాడు, బాధ్యతలు నిర్వర్తించాడు. దేనికి అంటలేదు. ఎవరినీ అంటించులోలేదు. అసంగత్వానికి ఇంతకంటే నిదర్శనము ఏమి కావాలి?

ఈ విషయము పైననే శంకరాభగవద్త్పాదులు వ్రాసిన బ్రహ్మజ్ఞానావళి మాల చక్కగా చర్చించుతుంది. అసంగత్వము గురించి తెలుసుకోటానికి, అనుసరించటానికి ఈ ఇద్దరు జగద్గురువులకంటే ఎక్కువగా మనకు నేర్పే వారెవ్వరు? ఆచరించడమే మన విధి. అందుకోలేకపోతే మన దురదృష్టము. అందుకుని ఆచరిస్తే అద్వైతము, ఆనందము అందుకోలేకపోతే ద్వైతము, దుఃఖము. ఎవరికీ వారే నిర్ణయించుకోవాలి ఏమికావాలి నాకని.

వైరాగ్యము లేకుండా అసంగత్వము రాదు. అసంగత్వము లేకపోతే అద్వైత జ్ఞానము అందదు ఎవరికీ. అసంగత్వమంటే అందరిని వదలి పొమ్మని కాదు. అందరిలో ఉంటూనే మనస్సులో ఒంటరిగా వుండటము. పడవలో ప్రయాణము చెయ్యొచ్చు కానీ పడవలోకి నీళ్లు రాకుండా చూసుకోవటం లాంటిది. అసంగత్వము అలవాటు పడిందంటే బంధత్వము లేదు అని అర్ధము. బంధమున్నదనుకొన్నప్పుడు మోక్షముకోసము ప్రయత్నము చెయ్యాలి. కానీ బంధమే లేదని తెలిసినప్పుడు మోక్షము కూడా లేనిదే అవుతుంది. తాను తానుగా మిగులుతాడు మనిషి. ఆత్మజ్ఞానిగా ఆనందంలో ఓలలాడుతాడు. అదే కైవల్యము. అదే జీవన్ముక్తి. అదే అందరికి కావలిసింది కానీ దొరికేది బహు కొద్దీ మందికి మాత్రమే.