మార్పు

మార్పు అనేది సహజము. జగత్తు మారుతుంది. జాయతి, గచ్ఛతి జగత్ అని కదా దాని నిర్వచనము. జగత్తు మారేటప్పుడు దానిలో వున్నవి మారకుండా ఎట్లా ఉంటవి? మారేది ఎవరు, మార్చేది ఎవరు, మారేది ఏమిటి, మారడము ఎందుకు జరుగుతుంది?

గింజ మొక్కగా మారుతుంది. మొక్క వృక్షముగా మారుతుంది, తరువాత కట్టెగా మారుతుంది, తరువాత భస్మముగా మారుతుంది. ఇది దాని సహజ ధర్మము. ఎవరూ ప్రయత్నము చేయనక్కరలేదు.

నీరు ఆవిరిగా మారుతుంది. తరువాత మేఘమవుతుంది, తరువాత వర్షము, తరువాత నదిగా మారుతుంది. సముద్రములో కలసి మళ్ళీ ఆవిరి అవుతుంది. దీనికి కూడా ఎవరి ప్రయత్నము ప్రత్యేకముగా ఏమీ అవసరము లేదు.

శిశువు బాలుడు అవుతాడు. తరువాత యువకుడు, మధ్యవయస్కుడు, ముదుసలి, ఆఖరిగా భస్మము అవుతాడు. ఇది శరీరానికి సంబంధించిన మార్పు. ఇవన్నీ ఆకారానికి సంబంధించిన మార్పులు.

మరి అన్ని జీవరాసులకు లేనిది, మనిషికి వున్నది మనస్సు ఒక్కటే. మారే మనస్సు మనిషికి అనేక కష్ట సుఖాలు కలిగిస్తుంది. కష్టాలు మనిషికి వుండవు. ప్రపంచములో వున్నవి. కానీ మనస్సు వాటిని లోపలి తీసుకొని వచ్చి దుఃఖాన్ని కలిగిస్తుంది. బాధలు తీరిపోయిన తరువాత, చాలాకాలము తరువాత కూడా జరిగిపోయిన సంఘటనలు తలపుకు తీసికొనివచ్చి దుఃఖము కలిగిస్తూ ఉంటుంది. కనుక మనిషి దుఃఖానికి కారణము మనస్సే కదా. మనస్సులో వున్న ఈ గుణాన్ని మార్చేదెట్లా? ఎవరు మారుస్తారు, ఎట్లా మారుస్తారు? ఇది సాధ్యమేనా అనిపిస్తుంది. కాని సాధ్యమే. అభ్యాసముతో అలవడుతుంది. అభ్యాసము చెయ్యడానికి ముందుగా కొంత జ్ఞానము కావాలి. మనస్సు ఏమిటి, బుద్ధి ఏమిటి అనేది తెలిసికొని బుద్ధి చెప్పినట్లు వినాలి. మనస్సు చంచలం, సంశయాత్మకము. బుద్ధి నిశ్చయాత్మకము, జ్ఞానపూరితము. బుద్ధి జ్ఞానపూరితము కనుక మనస్సు పెడత్రోవ పట్టినప్పుడు దానిని దిద్దుతుంది. దానికి ఆ సామర్ధ్యము ఎలావచ్చినది అంటే ,అది సంస్కారము కావచ్చు, లేదా పరిస్థితుల అవగాహన కావచ్చు, లేక తల్లిదండ్రులు, స్నేహితులు కలిగించిన ప్రభావము కావచ్చు. బుద్ధి ఆలోచనలను సరిచేసినప్పుడు మనస్సు వెనుతిరగగలగాలి. బుద్ధి రౌతు అయితే మనస్సు గుఱ్ఱము. రౌతు గుర్రాన్ని మచ్చిక చేసికొన్నట్లే , బుద్ధి మనస్సును మచ్చిక చేసుకొని మాట వినిపించాలి. మరెవ్వరూ బయటనుండి దానిని సరిచేయ్య లేరు.

ప్రతి రోజూ మనస్సు ఈరోజు ఎన్ని అనవసరమయిన ఆలోచనలు చేసింది అని ఆలోచించాలి. వీటివలన ఎంత దుఃఖము కలిగింది? అవసరము లేనివాటి గురించి, ఎప్పుడో జరిగిన వాటిని గురించి ఎందుకు ఆలోచించాను, దానివలన ఏమి సాధించాను, సమయము వృధా చేసికోవటం తప్ప అని బేరీజు వేసికోవాలి. మరో రోజు కొంచెము తగ్గించడము, మరో రోజు ఇంకొంచెము తగ్గించడమూ జరుగుతూ ఉంటే మనస్సుకు విశ్రాంతి ఏర్పడుతూ ఉంటుంది. “An idle man’s mind is a devil’s workshop” అని ఆంగ్లములో ఒక సామెత వుంది. కనుక దానిని ఖాళీగా ఎప్పుడూ ఉంచకూడదు. ఆ స్థానములో దానిని భగవన్నామము, ధ్యానము, సద్గ్రంథ పఠనము, లేదా సద్గురువు చెప్పిన పాఠాలు చక్కగా చదువుకోడమూ వగైరా చేస్తూ ఉండాలి. దాని వలన దుఃఖము తగ్గి శాంతి పెరుగుతుంది. మనస్సు అలజడి లేకుండా, శాంతిగా ఉంటే స్థూల శరీరము కూడా ఆరోగ్యముగా ఉంటుంది.

స్థూల సూక్ష్మ శరీరాలు రెండూ ఆరోగ్యముగా ఉంటే అప్పుడు నేనెవరు, ఎక్కడనుండి వచ్చాను, ఎక్కడికి పోతున్నాను అనే ప్రశ్నలు వస్తాయి(మనస్సులోకి). దానికి సమాధానము వెతికే అవకాశము దొరుకుతుంది. కనుక బాధలకు, బంధాలకు, మోక్షానికి అన్నిటికి కీలక స్థానము మనస్సు. మనస్సు చంచలం కృష్ణా అని అర్జునుడు అంటే అసంశయం మహాబాహో అన్నాడు కృష్ణుడు. కనుక చంచలమయిన మనస్సును అంచెలంచెలుగా మచ్చిక చేసుకొని, నిగ్రహించి, సన్మార్గములో ప్రయాణము చేసి, జీవితాన్ని సార్ధకం చేసికోటానికి ప్రయత్నించాలి ప్రతి మానవుడు. ఎంతవరకు సాధ్యమనేది మనిషి చేసే కృషి పైన ఆధారపడి ఉంటుంది.

ప్రతి వాళ్ళూ సమాజము మారాలి అని ఆలోచించే బదులు, తాను మారాలి అని ఆలోచిస్తే, ప్రయత్నము చేస్తే, సమాజము దానంతట అదే మారుతుంది. ఎందుకంటే సమాజమంటే మనుషుల సముదాయము కనుక. సాంఘిక మార్పులు, సామాజిక మార్పులు అంటూ బయట గొడవ చెయ్యడము ఆపి, నేను మారాలి అని లోపల గోల చేసికొనడము ఉత్తమ మార్గము.