నేనెవరిని

నేనొక ఆశ్రమవాసిని, నేనొక గృహస్థును
నేనొక సముద్రవాసిని, నేనొక ఆకాశవాసిని
నేనెవరిని?
అవన్నీ నేనే, కానీ నేను ఏదీ కాదు

నేనొక ఎగిరే పక్షిని, నేనొక ఈదే చేపను
నేనొక నడిచే మనిషిని, నేనొక కదలలేని తరువును
నేనెవరిని?
అవన్నీ నేనే, కానీ నేను ఏదీ కాదు

నేనొక స్త్రీని, నేనొక పురుషుడిని
నేనొక బిడ్డను, నేనొక ముదుసలిని
నేనెవరిని?
అవన్నీ నేనే, కానీ నేను ఏదీ కాదు

నాకు దేశము లేదు, నాకొక కాలము లేదు
నాకొక పరిమితి లేదు, నాకు జనన మరణాలు లేవు
నేనెవరిని?
అవన్నీ ఉన్నవని తెలిసిన వాడిని
కానీ అవేవి లేవని తెలిసికొన్న వాడిని

నాకు పగలు వుంది, నాకు రాత్రి వుంది
నాకు సూర్యుడున్నాడు, నాకు చంద్రుడున్నాడు
కానీ అవేవి లేని వాడిని
నేనెవరిని?
అవన్నీ ఉన్నవని తెలిసినవాడిని
కానీ అవి నేనేనని తెలిసికొన్నవాడిని

నేను కంటికి కనిపించను
నేను చెవికి వినిపించను
నేను మనస్సుకు తెలియను
నేనెవరిని?
ఇవన్నీ ఉన్నవని తెలిసినవాడిని
అవన్నీ నేను కాదని తెలిసికొన్నవాడిని
మరి నేనెవరిని?
ఇవన్నీ తెలిసికొనే తెలివిని నేను

నేనెవరో తెలిసినవారికి ఇవన్నీ తెలుసు
నేనెవరో తెలియని వారు తెలిసికోవచ్చు
తరచిచూస్తే మిగిలేది సత్యము
అదే నేను, నేనే అది.