ముహుర్తములు ఏమిటి, ఎందుకు, అవసరమా?

ముహూర్తము అంటే పన్నెండు క్షణముల కాలము లేదా రెండు ఘడియలు కాలము. అంటే కాలములలో ఒక పరిమితి. ముహూర్తము అంటే ఒక శుభసమయము అని ఆలోచిస్తారు కానీ, దుర్ముహూర్తములు కూడా వుండొచ్చుకదా. ఒక దినములో ఆ రెండు ఘడియల కాలము శుభ ముహూర్తమయితే, అది తప్ప మిగిలిన రోజంతా చెడ్డ కాలమా? ఈ రకమయిన ఆలోచనలు ఎవరు, ఎందుకు సృష్టించారు?

వసిష్ఠుడు శ్రీరామ పట్టాభిషేకానికి ముహూర్తము పెడితే రాముడు అడవుల పాలయ్యాడు. శుభముహుర్తములో సీతమ్మను పెళ్ళాడి భార్యావియోగముతో బాధపడ్డాడు. భగవదవతారమని అందరు స్తుతించే శ్రీరామునికే ముహుర్తములు పని చెయ్యలేదు. ఇక సామాన్య మానవులకు, మరొక సామాన్య మానవుడు పెట్టే ముహూర్తము ఎలా పనిచేస్తుంది. దీనికి ఇంత ప్రాధాన్యత ఇవ్వడము ఎందుకు అనేది ఆలోచించవలసిన విషయము.

మరొక కోణములో ఆలోచిస్తే ఈ ముహుర్తములు వెదకటం, పెట్టటం, మరే దేశాలలోను లేవు. అంటే వారందరికీ శుభములు జరగటం లేదా? భారతదేశములో కూడా ఆంధ్రదేశములో వున్న ముహుర్తముల పిచ్చి మరెక్కడా వున్నట్లుగా జాడ లేదు. తల్లిదండ్రులు ముహూర్తము చూసి చేసిన పెళ్లిళ్లు రెండు సంవత్సారాలు తిరగకుండా విడాకుల కోర్టులో ఎందుకు తేలుతున్నవి? ముహుర్తములు లేకుండా వారి వారి వీలును బట్టి చేసుకొన్న పెళ్లిళ్లు, భారత దేశములో కానీ, విదేశాలలో కాని దంపతులలో ఒకరు చనిపోయేటంతవరకు చల్లగా నడచినవి కోకొల్లలు. జనాభా లెక్కలు చూస్తారు కాని ఈ లెక్కలు ఎవ్వరూ చూడరు మరి.

ముహూర్తము సరిగా లేకపోతే ఏదో చెడు జరుగుతుందని భావిస్తారు. చెడు జరిగేది ఎవరికి? దేహానికి. దేహముతో తాదాత్మ్యము చెంది, దేహానికి వచ్చిన కష్టము తనదిగా భావించుకునేవారికి.

కృష్ణ పరమాత్మ భగవద్గీతలో
నైనం ఛిందంతి శస్త్రాణి, నైనం దహతి పావకః
న చైవం క్లే దయన్త్యాపో, నశోషయతి మారుతః

అని చెప్పినదంతా ఎక్కడికి పోయింది? ముహూర్తము ప్రకారము కార్యక్రమము జరపాలనుకునే వారికి నడిపించడము శాస్త్రోక్తము భారతీయ సంప్రదాయము అనుకొంటే, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గీతకంటే ప్రమాణమేముంది? వారి చేతికి వున్న ఘటీయంత్రము కొంచెము వెనుక ముందు ఉండచ్చు కదా. మరొక విషయమేమంటే, ఒక దేశములో ఒకకాలములో నిర్దేశించిన శుభముహుర్తము అదేకాలంలో మరొక దేశములో శుభముహుర్తం అవుతుందా. ఎందుకంటే దేశానికి దేశానికి మధ్యలో టైం తేడాలున్నవి కదా? ఇంతకంటే విచిత్రము మరొక్కటున్నది. ఇవి జరిగిన విషయములు. విదేశములో గర్భవతిగా వున్న కుమార్తెకు భారత దేశములో వున్న తల్లిదండ్రులు ఒక శుభముహుర్తము చూసి ఆ సమయములో పుట్టిన బిడ్డ జీవితము బాగుంటుంది కనుక, ఆ సమయానికి బిడ్డను ఆపరేషన్ చేసి బయటకు తీయించుకోవలసినదిగా కోరారు. సహజముగా పుట్టిన బిడ్డకు ఆలా అంటే కనీసము కొంతవరకు నమ్మవచ్చు. ఎందుకంటే చక్కగా అధ్యయనము చేసి చెప్పితే జ్యోతిశాస్త్రము సరిగానే ఉంటుందని నమ్మవచ్చు కనుక. ఇటువంటి మూర్ఖత్వమునుండి మనుషులు ఎప్పుడు బయటపడతారో ఊహకు అందదు.

మరొక కోణములో పరిశీలిస్తే ఇది కాలములో ఒక భాగము. కాలాన్ని కొలవటానికి ఒక ప్రమాణము. అసలు కాలమే మానవుని మనస్సు కల్పించింది కదా. కాలము మనస్సులో వుంది కాని బయట లేదు కదా. గౌడపాదాచార్యులు ఎవ్వరికి ఏ సందేహము లేకుండా అసలు సృష్టి జరుగలేదు, ఇదంతా మానసిక కల్పన మాత్రమేనని మాండూక్య కారికలలో వైతధ్య ప్రకరణములో అజాతవాదములో నిరూపించారుకదా? అంటే లేని సృష్టిలో, లేని కాలములో మానవుడు శుభముహుర్తము, దుర్ముహూర్తము, మంచి రోజు, చెడురోజు సృష్టించాడు. ఇది జీవ సృష్టి అవుతుంది కాని ఈశ్వర సృష్టి కాదు.

ఇది కనీసము అద్వైత సంప్రదాయములో నడిచేవారయినా ఆలోచించాలి కదా? ఆచరించాలికదా? మరెందుకు చెయ్యడములేదు? ఎవరో ఒక్కరు లేదా ఇద్దరు మిధ్యాచారులుండొచ్చు కాని, మిగిలినవారందరు సత్యాన్వేషణలో వున్నవారేకదా. లేదా భయమా? అయితే దేని గురించిన భయము. ఏదయినా చెడు జరుగుతుందని భయమైతే అద్వైతములో మొదటగా నేర్చుకోవలసిన నిత్యానిత్యవివేకము, దేహముతో తాదాత్మ్యము చెందకుండా వుండడము అనేవి కూడా అర్ధము చేసికోలేదని తేటతెల్లమవుతుంది. భిన్నాభిప్రాయాలతోవున్న కుటుంబసభ్యుల మధ్యలో శాంతికోసమా ముహుర్తాలు చూడడము, లేదా "నలుగురితోపాటు నారాయణా, కులముతోపాటు గోవిందా" అనుకుంటారా వీరందరూ?

ఏదయినా హద్దుమీరిన నమ్మకాలు, మూఢ నమ్మకాలు సాధారణ మనుష్యుల మనస్సులతో ఆటలాడుకొని ధనార్జన చెయ్యాలనే స్వార్ధపరులకు తప్ప మరెవ్వరికీ ఉపయోగము కనపడదు. ఇంగిత జ్ఞానము వున్న సాధారణ మనిషి ప్రపంచాన్ని పరిశీలనాదృష్టితో చూసినా, వేదాంత పరముగా చూసినా లేని జగత్హుకి, లేనికాలానికి విలువనివ్వటము హాశ్యాస్పదము. ఆత్మానుభూతి పొందిన జ్ఞానులకు ఈ విషయము స్పష్టము. మిగిలినవారు పంచాంగము ప్రక్కన పెట్టి నెమ్మదినెమ్మదిగా సత్యాన్వేషణ చెయ్యటమొక్కటే మార్గము.