పెద్దల సుద్దులు

పెద్దలు పిన్నలకు చిన్నతనమునుండి సుద్దులు నేర్పుతారు.ప్రత్యేకముగా నేర్పించాలని నేర్ఫించరు. వారు పలుకుతూ వుంటారు. ఏ ఇంటి చిలుక ఆ ఇంటి పలుకు పలుకుతుంది. కనుక పిన్నలకు వంటబడుతూ ఉంటవి. పెద్దలు సుద్దులు నేర్పినప్పుడు దాని అర్ధము నేర్పరు. ఎందుకంటే పిన్నల బుద్ధులు పెద్దవి కావు కనుక. సుద్దులు అర్ధము చేసికొనే బుద్ధి బలము కలిగే సరికి పెద్దలు అదృశ్యమవుతారు. మనుషులు పోతారు. మాటలు మనతో మిగిలిపోతవి. ఆదర్శములో ముఖమును తిలకించి తిలకము సరిదిద్దుకున్నట్లు, ఆదర్శ జీవితము గడపాలంటే అప్పుడప్పుడూ జీవితాన్ని సింహావలోకనం చేసికోవాలి. అప్పుడే సుద్దులలో అర్ధము అవగాహనకు అందుతుంది.

అటువంటి వాటిలో నేను విన్నది ఒకటి ఇది. ఊరి ఉసిరికాయ, సముద్రము ఉప్పు జాడీలో కలుసుకొంటవి అని(ఉసిరికాయ పచ్చడి) వినడానికి తమాషాగా ఉంటుంది. తింటే రుచిగా ఉంటుంది. పథ్యానికి పరమఔషధములాగా పనిచేస్తుంది.

ఒకదేశములో పుట్టి పెరిగిన మనిషి మరొక దేశములో పుట్టి పెరిగిన మనిషిని వివాహమాడి, ఇద్దరూ కలసి సంసారము సాగిస్తారు. అలాగే ఒక జాతీయత కలిగిన వ్యక్తి మరొక జాతీయత కలిగిన వ్యక్తితో కలసి మరొక దేశములో వ్యాపారము సాగిస్తారు. ఉప్పు సమముగా లేకపోతే పచ్చడి చెడిపోతుంది. విటమినులు పాడైపోయి, బూజు వస్తుంది. ఉపయోగపడదు. కలిసిన ఇద్దరు వ్యక్తుల మధ్య(భార్యాభర్తలు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు) అభిప్రాయం భేదాలు వస్తే, సత్యసంధత, సమగ్రత(integrity) లోపిస్తే, సామరస్యము చెడుతుంది. మనుగడ మసి అవుతుంది. విడాకులు, విడిపోడాలు మాత్రమే మార్గమవుతుంది.

కానీ వీటికంటే కూడా ముఖ్యమయినది మరొకటుంది ఉసిరిక ఉపాఖ్యానములో.

సముద్రములో ఉప్పు అన్నాము. ఉప్పు లేకపోతే దేహము చెడిపోతుంది. ఎందుకంటె దేహము పనిచేయటానికి ఉప్పుకావాలి కనుక. ఆ ఉప్పు సముద్రమునుండి వస్తోంది. జీవబ్రహ్మాఐక్యము గురించి చెప్పాలంటే సముద్రములోనుండి వచ్చిన అల సముద్రములో కలసినట్లుగా కలుస్తుంది అంటారు. సముద్రమును పరమేశ్వరుడిగా ఉదహరించినప్పుడు, ఆ పరమేశ్వరుడినుండి వచ్చిన ఉప్పు జీవనాధారమయ్యింది. మరొకలా ఆలోచిస్తే, ఉసిరిక వృక్షము జగత్తులో భాగము. జీవుడు కూడా జగత్తులో భాగమే. ఉసిరిక ఉప్పుతో కలసినట్లే, కల్పాంతరములో జగత్తు, అందులో వున్న జీవులు కల్పాన్ని కల్పించిన ఈశ్వరుడిలో కలిసిపోతారు.(కానీ ఐక్యం కారు). స్వప్నావస్థ లాగే జాగ్రదావస్థ కూడా మిధ్య అనే చెప్పాలి. ఎందుకంటె ఇది కూడా మనస్సు కల్పించినదే కనుక. కల్పితము సత్యము కాదు కనుక లేదని చెప్పితే అప్పుడు ఈశ్వరుడు, జీవుడు కూడా లేరని చెప్పాలిసి వస్తుంది. అది శూన్య వాదానికి దారి తీస్తుంది. అది సనాతన ధర్మము ఒప్పుకోదు. కనుక మిధ్యా ప్రపంచాన్ని అంగీకరించి, దానిలో వున్న జీవుడు ప్రయాణము సాగించి పరమాత్మను చేరాలి. ఇక్కడే ఆమలకము నన్ను చూడండోయ్ అంటుంది. నేను భూమి లాగే గుండ్రముగా వున్నాను.ఉప్పుతో కలిసాను. జీవుడా, నీవు కూడా గుండ్రముగా ప్రయాణము చేసి పరమాత్మను చేరుకో మంటుంది. ఎందుకంటె పైకి వెళ్ళటమంటే ఊర్ధ్వ లోకాలకు పోవటముకదా. అంటే స్వర్గానికి పోవటం. "క్షేనేపుణ్యే మర్త్య లోకం విశంన్తే" అన్నాడు భగవానుడు గీతలో. అది కాకుండా స్వర్గములో వున్నదంతా గానా బజానా కనుక కైవల్యానికి చేరే మార్గము లేదు. క్రిందికి పోవటమంటే అధోలోకాలకు పోవడము. అంటే క్రిమికీటకాలలాగానో, జంతుజాలం లాగానో పుట్టడము. అప్పుడూ కైవల్యము చేరే అవకాశము లేదు. జీవన్మరణ చక్రము ఆగినప్పుడేగదా కైవల్య సిద్ధి కలిగేది అందుకే ఆమలకము గుండ్రముగా ప్రయాణము చేయమంటోంది. నేను ఉప్పుతో కలసి దేహానికి ఆరోగ్యాన్నిస్తున్నాను. నీవు ఈ దేహాన్ని వాడుకొని పరమాత్మతో కలసి కైవల్యాన్ని పొందమని.

దృశ్యేత్ జ్ఞానమయీమ్ కృత్వా పశ్యేత్ బ్రహ్మమయీమ్ జగత్.

ఆమలకానికి కూడా ఆత్మజ్ఞానమున్నదా? ధ్యానములో ఈ ఆలోచనలన్నీ వస్తే నిధిధ్యాసన చెడినట్లా లేక సక్రమముగా నడిచినట్లా? ఇది ఆశంక. ఇదంతా ఆమలకము ఆంతర్యములో చేసిన అల్లరి. మనస్సుతో ఆడిన ఆటలు.