అందము ఆనందము

అందము ఎక్కడ ఉంటుంది? అది బాహ్యానికి సంబంధించిందా, లేక అంతర్యానికా అంటే రెండూ అని చెప్పవలసి వస్తుంది. ఎందుకంటె కొంతమందికి బాహ్య సౌందర్యము కోకొల్లలుగా ఉంటుంది కానీ, మానసిక సౌందర్యము లోపిస్తుంది. కనుక దీనికి కొలమానము ఏమిటి? చూచేవాడి కన్నులు బాహ్య సౌందర్యానికి కొలతలు. ఆంగ్లములో “Beauty is in the eye of the beholder” అంటారు. లేదా సౌందర్యముగా వున్న వ్యక్తి మనస్సులోని భావన అది. పైన ఉన్న చర్మము తీసి చూస్తే అప్పుడు ఈ అందము ఎంత అందముగా ఉంటుంది? మరి అంతర్సౌందర్యానికి కొలమానము ఏమిటి? మనిషి నడిచే నడవడిక, ప్రవర్తన. చెప్పింది చెయ్యని వారు కొందరయితే, చేసేది చెప్పని వారు మరికొందరు. సత్యము ఎల్లవేళలా పలకడము కష్టము కనుక అసత్యాన్ని ఆశ్రయించడమే పరమావధిగా పెట్టుకుంటారు. అందము అనేది ధరించే దుస్తులలో లేదు, మనిషిలో దాగిన మానవత్వములో ఉంటుంది. అందము అనేది నవ్వే పెదవులలో లేదు, బాధను దాచుకొనే గుండెలో వుంది. అందము అనేది అవమానించే గుణములో లేదు, ప్రేమతో ఆదరించే గొప్ప మనస్సులో వుంది ఇది ఎవరికి వారు పరిశీలించుకోవలసిన విషయము.

ఇక ఆనందము గురించి ఆలోచిస్తే, ఇది బాహ్యమా, అంతరంగికమా? ఇది కూడా రెండూ అనే చెప్పాలి. చేసిన ప్రతి పనిలోనూ ఆనందము దొరకక పోవచ్చు. కానీ ఏమి చేయకుంటే ఆనందము పొందలేము. ఎందుకంటే, బయటకు సంతోషముగా కనపడతారు కొందరు. మనస్సులో ఏమున్నా సరే, మనస్సులో సంతోషముగా వున్నా, బయటకు చలనము లేకుండా కనబడుతారు మరికొందరు. ఈ రెండూ కానిది మరొక ఆనందము వుంది. అదే ఆత్మానందం. ఇది ఎవరికీ కనపడనిది, వినపడనిది, ఆత్మానుభూతిలో వున్న సిద్ధపురుషుడికి మాత్రమే అవగతమయ్యేది. అదే భూమానందము. "యత్ర న అన్యత్ పశ్యతి, న అన్యతి శృణోతి, న అన్యతి విజానీతి తత్భూమా" అన్నది శృతి(నారద సనత్కుమార సంవాదము, Ch.7, చాందోగ్య ఉపనిషద్). దేని యందు ఆత్మ కంటే అన్యమయినది గోచరించదో, అన్యమయినది వినిపించదో, అన్యమయినది తెలియదో అదే భూమానందము. సిద్ధుడు అనుభవించే ఆత్మరతి, ఆత్మక్రీడ మాత్రమే అసలైన ఆనందము. ఇది పొందాలంటే ఏమి చెయ్యాలని ప్రతి మనిషి ఆలోచించుకోవలసిన విషయము. ఎంతమందికి సాధ్యమో అది వేరే విషయము.

అందానికి ఆనందానికి సంబంధము ఏమిటి. ఆత్మానందం అనుభవించే వ్యక్తికి, మానసికముగా సత్ప్రవర్తనతో వున్న వ్యక్తికి, బాహ్యముగా అందము లేకపోయినా, వర్చస్సు ముఖములో గోచరిస్తుంది చూసే వాళ్లకు. అది చూడలేని వాళ్లకు బాహ్య ఆకృతి కనిపిస్తుంది. దీనికి తార్కాణము అష్టావక్ర మహర్షి జీవితమే. జనక మహర్షికి ఆయనలో జ్ఞానసౌందర్యము కనిపించింది. మిగిలిన సభా సభ్యులందరికి ఆయన శరీరములో వున్న ఎనిమిది వంకరలు(బాహ్య సౌందర్యము)మాత్రమే కనపడినవి. వారుచేసిన గేలికి ఆయన ఆనందము ఏమి భగ్నము కాలేదు. ఆయన ఆనందము నిరవధిక ఆనందము. ఇతరులపైన గాని, జగత్హు పైన కానీ ఆధారపడలేదు కనుక. అది కేవలము జ్ఞాన సౌందర్యము మాత్రమే. కనుక ఆనందమే అందము కానీ అందము ఆనందము కాదు. అందము అహంకారానికి దారి తీస్తుంది. ఆనందము కైవల్యానికి దారి చూపుతుంది.