Telugu Essays 1-20
- 1. పలకలేని వాళ్ళు పలికితే ఎలావుంటుంది
- 2. అందము ఆనందము
- 3. అసంగత్వము
- 4. ఒక అనామిక ఆక్రందనము
- 5. పెద్దల సుద్దులు
- 6. కడుపే కైలాసము, ఇల్లే వైకుంఠము
- 7. భయము
- 8. మార్పు
- 9. ముహుర్తములు ఏమిటి ఎందుకు అవసరమా
- 10. ముక్తి
- 11. వామన మూర్తి - పౌరాణిక దృష్టి, తాత్విక దృష్టి
- 12. ఒక సుమబాల గోల
- 13. చావు ఎవరినీ చంపదు
- 14. కృష్ణుణ్ణి అర్ధము చేసికోవటం ఎలా ? ఇలా !!
- 15. గ్రహములు మంచివా, చెడ్డవా?
- 16. నేనెవరిని
- 17. నేను చేసానా లేక అది జరిగినదా?
- 18. వైరుధ్యములో దాగిన సత్యము
- 19. పాల సముద్రము/ క్షీర సాగరము
- 20. నా ప్రార్ధన
నేను చేసానా లేక అది జరిగినదా?
ఇది చూసిన వారికి నేను గానీ మరొకరు గానీ చెయ్యకపోతే పని ఎలా జరుగుతుంది అనే ప్రశ్న పడుతుంది. నిజమే మరి. చెయ్యటానికి కాళ్ళు, చేతులు కావాలి, చెయ్యాలని కోరేటందుకు మనస్సు కావాలి. కనుక ఇది ఒక పిచ్చి ప్రశ్న లాగా కనపడుతుంది. కొంచెము ఆలోచించితే సత్యము, దాని అంతరార్ధము తెలుస్తుంది.
ఇది కర్తృత్వ భోక్తృత్వ భావనకు సంబంధించిన విషయము. కర్తృత్వము అంటే నేను చేసాను అనుకోడము. భోక్తృత్వము అంటే దాని ఫలితము అనుభవించడము. కానీ ఇక్కడ చర్చించేది కర్తృత్వము మాత్రమే.
ఒక పని జరిగినప్పుడు నేను చేసాను అనుకునేవాడు సామాన్య మానవుడు. ఈశ్వర భృత్యుడిగా చేసాను అనుకునేవాడు భక్త్తుడు. అది జరిగింది, నేను చూస్తున్నాను అనేవాడు జ్ఞాని.
కర్తృత్వ భావము అంటే నేను కనుక ఈ పని చేసాను, ఇంకెవ్వరూ చెయ్యలేనంత గొప్పగా చేసాను, ఇది నా గొప్పతనము, నా ధనము వలన జరిగింది, ఇది అనన్య సాధ్యము అనుకోడము మొదలయినవన్నీ. ఇటువంటి భావాలను పలికే మనిషికి కర్తృత్వ భావన వున్నదని అర్ధము. ఇది సత్యమేనా? అంగవైకల్యము లేని శరీరము, అదిచెయ్యడానికి తగిన బలము, ధనము సమకూర్చినదెవరు? దీనికి ఎంతమంది సహకరిస్తే ఈ పని జరిగింది? ఇలా ఆలోచించినప్పుడు ఇది పరమేశ్వరుని అనుగ్రహము వలన జరిగింది కానీ నా వలన కాదు అనేది తేటతెల్లమవుతుంది.
మరొక రకమయిన కర్తృత్ర భావన ఏమంటే, నేను భగవంతుని దాసుడను. యజమానికి పనివాడికి మధ్యలో వుండే సంబంధము లాంటిది. యజమాని ఇచ్చే ధనముతో తన జీవనము గడుపుకోవాలి కనుక అతనికి అణిగిమణిగి ఉండి చెప్పినది చేసి, ఇచ్చిన ధనము తీసికొని నిశ్చింతగా పోతాడు. భక్తుడు కూడా అలాగే భగవంతునికి చెయ్యవలసిన సేవలన్నీ ప్రీతితో చేసి, వచ్చిన ప్రతిఫలము తీసికొంటాడు. నేను పుణ్యము చేసికొన్నాను కనుక నాకు మంచి జీవితము వచ్చింది అనో లేదా నేను చేసినపాపానికి ఫలము భగవంతుడు ఇచ్చాడు అనే భావన ఉంటుంది. ఈ భావన వున్నప్పుడు మానసిక బాధ కొంత తగ్గుతుంది. ఇక్కడ కూడా కర్తృత్వమున్నదనే చెప్పాలి.
మూడవరకము వారు నేను చెయ్య లేదు అది జరుగుతోంది, నేను చూస్తున్నాను అనుకొనే వారు. వీరే జ్ఞానులు. పనులు(దైనందిన కార్యక్రమములు, లేదా మరేదయినా పనులు కావచ్చు) యధాతధముగా జరుగుతూ ఉంటవి. జ్ఞాని దృష్టిలో చేసేది చెప్పేది, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు. కనుక, తానూ ఇవేవి కాదనే దృఢమయిన భావనలో ఉంటాడు. కనుక తనను తాను ఒక సాక్షిగా మాత్రమే చూస్తూ, ఆ పనులు వేటికవి జరుగుతున్నవని, తాను, సాక్షిని మాత్రమేనని, తాను చూస్తున్నాను కానీ తనకు వాటికి సంబంధము లేదని గ్రహిస్తాడు. కనుక ఒక పని సవ్యముగా జరిగినా, విరుద్ధముగా జరిగిన అతనిలో చలనము ఉండదు. సంతోషము, దుఃఖము రెండూ ఉండని సమ స్థితి ఉంటుంది. అందరమూ ఈ స్థితికి చేరగలితే నిత్యానందములో ఉండొచ్చు.
నేను చేశాననే కర్తృత్వ భావన ఎప్పుడు పోతుందో, లేదా మనము ఎప్పుడు పోగట్టుకోగలుగుతామో అప్పుడు ఎదో పొందామని, పొందలేదని, పొందాలని అనిపించదు. కర్తృత్వ భోక్తుత్ర భావనలు రెండూ వదల గలిగిన వాడే ధన్య జీవి. కనుక అందరమూ కృషి చేసి ఈశ్వర కృపతో ఈ స్థితికి చేరుకొని నిత్యానందములో వుండెదముగాక. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు మన పెద్దలు.
సర్వేజనా సుఖినో భవంతు