Telugu Essays 1-20
- 1. పలకలేని వాళ్ళు పలికితే ఎలావుంటుంది
- 2. అందము ఆనందము
- 3. అసంగత్వము
- 4. ఒక అనామిక ఆక్రందనము
- 5. పెద్దల సుద్దులు
- 6. కడుపే కైలాసము, ఇల్లే వైకుంఠము
- 7. భయము
- 8. మార్పు
- 9. ముహుర్తములు ఏమిటి ఎందుకు అవసరమా
- 10. ముక్తి
- 11. వామన మూర్తి - పౌరాణిక దృష్టి, తాత్విక దృష్టి
- 12. ఒక సుమబాల గోల
- 13. చావు ఎవరినీ చంపదు
- 14. కృష్ణుణ్ణి అర్ధము చేసికోవటం ఎలా ? ఇలా !!
- 15. గ్రహములు మంచివా, చెడ్డవా?
- 16. నేనెవరిని
- 17. నేను చేసానా లేక అది జరిగినదా?
- 18. వైరుధ్యములో దాగిన సత్యము
- 19. పాల సముద్రము/ క్షీర సాగరము
- 20. నా ప్రార్ధన
ముక్తి
ముక్తి అనే పదానికి వివిధ మతాలు వివిధ నిర్వచనములు ఇస్తాయి. ఎవరి నిర్వచనము వారికి సమంజసముగానే తోచినా సత్యమేదో అని గురుముఖతః విచారణ చెయ్యగలిగిన వారికి, శాస్త్ర పరిశీలన చేసేవారికి, శ్రుతులను స్మృతులను ప్రమాణముగా తీసికొనేవారికి అద్వైతమే సత్యముగా అవగాహనకు వస్తుంది.
చార్వాకులకు ముక్తి ద్రవ్య ప్రధానము. దేహము, భోగము, దేహపతనమే వారికి ముక్తి. పునర్జన్మ అంగీకారము కాదు.
జైనులకు ముక్తి దేశప్రధానము. స్థూల దేహముతో చేసే పుణ్యకార్యములతో సూక్ష్మ దేహము ఏడు లోకములు ప్రయాణము చేసి మహావీర జైనుడు(వారి మత స్థాపకుడు) వుండే లోకము చేరడము ముక్తి. అలా చేరలేకపోతే మరలా జన్మిస్తారు.
బౌద్దులకు ముక్తి కాల ప్రధానము. ఏకాలంలొ స్థూల దేహము లేకుండా పోతుందో అదే నిర్వాణము లేదా ముక్తి. వాసన క్షయము జరగటం ముఖ్యము వీరికి. అంతవరకు పునర్జన్మ జరుగుతుంది.
ఉపాసకులకు(ద్వైతులు, విశిష్టాద్వైతులు) ముక్తి దేవతా ప్రధానము. వీరి ప్రకారము విష్ణువును ఉపాసిస్తే ముక్తి కలుగుతుంది. ఎందుకంటే విష్ణువు ముకుందుడు అంటే ముక్తినిచ్చేవాడు. శివుడు మధ్యవర్తి. మిగిలిన దేవతలెవ్వరూ ముక్తినివ్వలేరు. వీరు చెప్పే ముక్తి నాలుగు రకములు.
సాలోక్యము - విష్ణులోకంలో ప్రవేశించ గలుగుతారు. విష్ణు దర్శనము దూరమునుండి చేసికోగలుగుతారు.
సామీప్యము - విష్ణు లోకములో వుండి విష్ణువుకు దగ్గరగా వెళ్లగలుగుతారు. కానీ వేషధారణ ఉండదు.
సారిష్టి - విష్ణు లోకములో వుండి, విష్ణువు లాగా వస్త్ర ధారణ చేసికొని వుంటారు కానీ విష్ణువుకు వున్న శక్తులేమి వుండవు.
సాయుజ్యము - విష్ణువులో లీనమై వుంటారు.
షడ్డర్శనములలో అందరు ముక్తిని అంగీకరిస్తారు కానీ నిర్వచనములు వేరుగా వున్నవి. ముక్తి లేదా మోక్షమును ఇలా నిర్వచించవచ్చు. మోహక్షయము ముక్తి. మోహము అంటే మో+అహం. మోక్షము అంటే మో+క్షయము.
ప్రవ్రుత్తి, జన్మ, దుఃఖము, రాగద్వేషాలు, మిధ్యాజ్ఞానము నశించిన తరువాత, బ్రహ్మాత్మజ్ఞానము కలగటమే ముక్తి అని అద్వైతుల నిర్వచనము.
అద్వైతులు నిర్వచించే ముక్తి కూడా పలు నామములతో చెప్పబడుతున్నది. దీనికి కారణము బ్రహ్మజ్ఞానులు బ్రహ్మ జ్ఞానము కలిగిన తరువాత కూడా వివిధ స్థాయిలలో ఉండటమే. జీవన్ముక్తి లేదా కాలాంతర ముక్తి - దేహాత్మ భావము వదలి, నేను బ్రహ్మనే అనే జ్ఞానము కలిగి(స్వస్వరూప జ్ఞానము) సర్వకాలములందు బ్రహ్మానందమును అనుభవించుట. నిర్గుణ భావమును గ్రహించి నాది అనే మమకారము వదలి బ్రతుకుట.వ్యవహారంలో మమత కలిగితే పునర్జన్మ కలుగుతుంది.
ఇది నాలుగు రకములుగా చెప్పబడినది.
బ్రహ్మవిదుడు
బ్రహ్మవిద్వరుడు
బ్రహ్మవిద్వరీయుడు
బ్రహ్మవిద్వరిష్ఠుడు
వీరిలో అందరూ తత్వజ్ఞానము కలిగిన వారే. కానీ కొందరికి సంపూర్ణ వాసనా క్షయము జరుగదు. కొంతమందికి మనోనాశము జరుగదు. కొంతమందికి సాధనలతో అవసరము ఉంటుంది. బ్రహ్మవిద్వరిష్ఠుడు మాత్రము తత్వజ్ఞానము, మనో నాశము, వాసనా క్షయము కలిగి సమాధి స్థితిలో ఉంటాడు.
క్రమ ముక్తి - కార్యకారణ దృష్టితో సాధన చేసి వ్యష్టి దృష్టి నుండి సమష్టి దృష్టిని పొంది క్షరాక్షరములు రెండూ బ్రహ్మమేనని గ్రహించి ముక్తిని పొందుట. వీరు దేహపతనము తరువాత కర్మములు నశించి దేవయానములో బ్రహ్మ లోకము చేరుతారు. అచట చతుర్ముఖ బ్రహ్మదగ్గర బ్రహ్మజ్ఞానము పొంది ప్రళయకాలము వరకు బ్రహ్మ లోకములో వుండిన తరువాత బ్రహ్మాత్మైక్యము కలుగుతుంది.
సద్యోముక్తి - ఆచార్య ఉపదేశము, శాస్త్ర పరిశీలన జరిగిన తరువాత శుద్ధ బుద్ధితో ఇప్పుడే ఇక్కడే బ్రహ్మ తత్వము తెలిసికొని, అహంబ్రహ్మాస్మి అనే స్థిరనిశ్చయముతో ఉండుట. బ్రహ్మవిద్వరిష్టుడు ఈకోవలో చేర్చబడతాడు
విదేహముక్తి లేదా కైవల్య ముక్తి - జీవన్ముక్తుని ప్రారబ్దము పూర్తి ఐన తరువాత, దేహపతనము జరిగిన తరువాత కలిగే ముక్తి. పునర్జన్మ లేని బ్రహ్మత్మైక్య స్థితి.
మోక్షకారణ సామాగ్య్రామ్ భక్తిరేవ గరీయసీ
స్వస్వరూప సంధానం భక్తిరిద్యభిధీయతే
శ్రీ ఆదిశంకరాచార్య స్వామి, వివేకా చూడామణి శ్లో. 31