Telugu Essays 1-20
- 1. పలకలేని వాళ్ళు పలికితే ఎలావుంటుంది
- 2. అందము ఆనందము
- 3. అసంగత్వము
- 4. ఒక అనామిక ఆక్రందనము
- 5. పెద్దల సుద్దులు
- 6. కడుపే కైలాసము, ఇల్లే వైకుంఠము
- 7. భయము
- 8. మార్పు
- 9. ముహుర్తములు ఏమిటి ఎందుకు అవసరమా
- 10. ముక్తి
- 11. వామన మూర్తి - పౌరాణిక దృష్టి, తాత్విక దృష్టి
- 12. ఒక సుమబాల గోల
- 13. చావు ఎవరినీ చంపదు
- 14. కృష్ణుణ్ణి అర్ధము చేసికోవటం ఎలా ? ఇలా !!
- 15. గ్రహములు మంచివా, చెడ్డవా?
- 16. నేనెవరిని
- 17. నేను చేసానా లేక అది జరిగినదా?
- 18. వైరుధ్యములో దాగిన సత్యము
- 19. పాల సముద్రము/ క్షీర సాగరము
- 20. నా ప్రార్ధన
పాల సముద్రము/ క్షీర సాగరము
సాధారణముగా హిందువులందరికి తెలిసిన పదములు పాలసముద్రము లేదా క్షీరసాగరము, వైకుంఠము. ఇవన్నీ పురాణములలో చెప్పబడినవి. పురాణము అంటే పుర+అపి+నవ. అంటే పురాణ కాలములో(పాత విషయము) విషయమే అయినా ఆధునికులకు ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణముగా మలచి, కధలో వేదసారాంశము చెప్పటమే పురాణము చెప్పుట అంటే. చెప్పేవారు కథలాగా కాక దానిలో అంతరార్ధము శ్రద్ధగా బోధించాలి. ప్రస్తుత కాలములో వేదాధ్యాయనము చేసేవారు చాలా చాలా తక్కువమంది. చెప్పేవారు అంతకంటే తక్కువ. శ్రద్ధ అంతా ధనార్జన పైన, దారపుత్రాదుల వ్యామోహము పైన.
విజ్ఞానశాస్త్రము ప్రకారము పాలసముద్రము అంటే నక్షత్ర మండలము లేదా పాలపుంత అంటారు. కానీ దీనిని ఒక భావప్రకటనగా మాత్రమే తీసికొని విశ్వము అని అర్ధము చేసికోవాలి. మరి దానిలో మధనమేమిటి? అమృతమేమిటీ? వైకుంఠము ఏమిటి? ఇవన్నీ ఎవరు ఎప్పుడూ చూడలేదు కదా? మనము దానిని ఎందుకు విశ్వసించాలి? పురాణములో చెప్పినవి సత్యమని ఎందుకు అనుకోవాలి? వీటికి సంక్షిప్తములయిన సమాధానములు ఈ క్రింద ఇవ్వబడినవి.
పాలసముద్రములో చెప్పిన సముద్రమే ఈ సంసారము. ఈ సంసారము ఒక సాగరము, దీనిని ఈదేది ఎలా, దరిచేరేది ఎప్పుడు అని తరచుగా మనిషి నోటినుండి వినపడుతూ ఉంటుంది. కానీ దానికి సమాధానము వెతుకుకొనే లోపున మరొక సమస్య మీద పడుతుంది. అసలు విషయము వెనుక పడుతుంది.
మరొకరకముగా చెప్పాలంటే మనిషి మనస్సులో జరిగే భావపరంపర, కోపము, ఈర్ష్య, అసూయా మొదలగు వాటివలన కలిగే ఆందోళన, అల్లకల్లోలమే సాగరము. మనోసాగరము అనే మాట కూడా తరచుగా వింటూ ఉంటాము. జగత్తు కూడా సంసారమే. ఎందుకంటే మనిషి మనుగడ తన ఒక్కడిపైన ఆధారపడి లేదు. ప్రకృతి పైన, వాతావరణము, పశుపక్ష్యాదులు, మిగిలిన మానవులపైనా ఆధారపడి ఉంటుంది. దేనిలో ఒడుదుడుకులు వచ్చినా బ్రతుకు చిన్నాభిన్నమవుతుంది. ఇదే సముద్రములో తుఫాను.
ఇక మధనము గురించి చూద్దాము. ఈ విచ్ఛిన్నమయిన మనస్సు నుండి తెల్లనివెన్న లాంటి పదార్ధాన్ని, అంటే సత్వగుణాన్ని, ప్రశాంతతను బయటకు తీయడమే మధనము. పురాణములో క్షీరసాగర మధనానికి మందరపర్వతము కవ్వము, వాసుకి త్రాడు. మరి మనకో? శమము, దమము(ఇంద్రియ నిగ్రహము) వాక్తపస్సు, బ్రహ్మచర్యము, ఈర్ష్య, అసూయా కోప తాపములు తగ్గించుకోడమూ, వైరాగ్యము మొదలయినవి అలవాటు చేసికొని, తామరాకు మీద నీటిబొట్టు లాగ, ఈ ప్రపంచములో అన్నీ చేస్తూ, అందరిలో మెలుగుతూ ఉండాలి. మనస్సు, దానిలోని ఆలోచనలు అధీనమయినపుడు, మనస్సు ఖాళీగా ప్రశాంతముగా ఉంటుంది. “నిశ్శబ్దం బ్రహ్మముచ్చతే” అన్నది శాస్త్రం అంటే నిశ్శబ్దమే పరబ్రహ్మ స్వరూపమని. ఆత్మయే పరబ్రహ్మ కనుక, ఆ ఆలోచనలేని ప్రశాంత స్థితి ఏదో అదే మన స్వరూపస్థితి. ఆ స్వస్థితిలో నిలిచి ఉండటమే అమృతత్వము. స్వస్తత కలిగిన స్థితియే స్వస్థితి / స్వరూపస్థితి.
మరి వైకుంఠము మాట ఏమిటి? విష్ణుమూర్తి ఎక్కడ వున్నాడు? “విష్ణు” అంటే వ్యాపన శీలత్వము కలిగినవాడు అని అర్ధము. సర్వత్రా వ్యాపించినవాడు వైకుంఠములో మాత్రమే ఉంటాడా? సర్వత్రా వున్నవాడు గనుక ప్రతి హృదయములోనూ వున్నాడని అర్ధము. కనుక ప్రతి హృదయము వైకుంఠమే. వైకుంఠము అంటే “విగతా కుంఠయ శ్యాస విఖంటా దుఖః” కర్మేంద్రియములకు జ్ఞానము పొందే శక్తీ లేదు. జ్ఞానేంద్రియములకు మూలము బుద్ధి. బుద్ధి సత్వగుణ ప్రధానము. జ్ఞానము బుద్ధిలో కలుగుతుంది. నామరూపాలు ప్రకాశింపచేసే సత్వగుణ ప్రధానమయిన చైతన్యమే విష్ణుమూర్తి. సత్వగుణ ప్రధానమయిన బుద్ధిలో చైతన్య రూపముగా ప్రతిఫలించేదే విష్ణుమూర్తి. అదే వైకుంఠము. కుంతః/కుంఠ అంటే ఆందోళన లేదా అలజడి అని అర్ధము. విగత అంటే అవి లేకుండా వుండటము. అవి లేని చోటు అని అర్ధము. ఆందోళన కలిగేది మనస్సులో. కనుక ఏ మనస్సులో లేదా ఎవరి మనస్సులో ఆందోళనలు లేకుండా ప్రశాంతత నెలకొని ఉంటుందో అదే వైకుంఠము. అదే విష్ణు స్థానము. ఇక్కడ జయవిజయులు(ద్వారపాలకులు) గాని, యుగయుగాలుగా విష్ణుదర్శనము కోసము ఎదురు చూసే భక్తులు కానీ వుండరు. నీవు, నీ హృదయములో ఉన్న పరమాత్మ ఏకమై, నిత్యమై, సత్యమై గుడిలో అఖండదీపములాగా వెలుగుతూ వుంటారు. ఈ విషయము భగవద్గీత(18.61) శ్రీ కృష్ణ పరమాత్మ ఇలా చెప్పి వున్నాడు.
"ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఽర్జున తిష్ఠతి |
భ్రామయన్ సర్వభూతాని యంత్రా రూఢాని మాయయా ||
అర్థము: “శరీరరూప యంత్రములను అధిరోహించిన సర్వప్రాణుల హృదయములయందు అంతర్యామిగా నున్న పరమేశ్వరుడు తన మాయ చేత వారి వారి కర్మలననుసరించి వారిని భ్రమింపచేయుచున్నాడు.” జగద్గురువు నోటినుండి వచ్చినది “అందరి హృదయములోనూ పరమాత్మ వున్నాడని”. కనుక సందేహించవలసిన విషయమేమి లేదు.
In that personal abode of the Lord, the material modes of ignorance and passion do not prevail, nor is there any of their influence in goodness. There is no predominance of the influence of time, so what to speak of the illusory, external energy; it cannot enter that region.where the inttellect becomes impenetrable that becomes vikuntha.(వైకుంఠము)
ఇదే వేదసమ్మతమైన సత్యము. ఇదే ఆనందము. ఇదే అమృతత్వము. ఇదే మానవుడు సాధించవలసినది. గమ్యము, మార్గము ఇచట చూపబడినవి. అర్ధము చేసికొని ఆచరించడమో లేదో అది చదువరులకు వదలుతున్నాను.