Telugu Essays 1-20
- 1. పలకలేని వాళ్ళు పలికితే ఎలావుంటుంది
- 2. అందము ఆనందము
- 3. అసంగత్వము
- 4. ఒక అనామిక ఆక్రందనము
- 5. పెద్దల సుద్దులు
- 6. కడుపే కైలాసము, ఇల్లే వైకుంఠము
- 7. భయము
- 8. మార్పు
- 9. ముహుర్తములు ఏమిటి ఎందుకు అవసరమా
- 10. ముక్తి
- 11. వామన మూర్తి - పౌరాణిక దృష్టి, తాత్విక దృష్టి
- 12. ఒక సుమబాల గోల
- 13. చావు ఎవరినీ చంపదు
- 14. కృష్ణుణ్ణి అర్ధము చేసికోవటం ఎలా ? ఇలా !!
- 15. గ్రహములు మంచివా, చెడ్డవా?
- 16. నేనెవరిని
- 17. నేను చేసానా లేక అది జరిగినదా?
- 18. వైరుధ్యములో దాగిన సత్యము
- 19. పాల సముద్రము/ క్షీర సాగరము
- 20. నా ప్రార్ధన
వామన మూర్తి - పౌరాణిక దృష్టి, తాత్విక దృష్టి
వామనావతారము దశావతారములలో ఒకటి. ఏమాత్రము ఆధ్యాత్మిక చింతన కలిగినవారికైనా దశావతారములు తెలిసేవుంటవి. కనుక అవతారము అంటే ఏమిటనిగాని, ఎందుకు అనే ప్రశ్నగాని ఇక్కడ తర్కించనవసరము లేదు. కానీ పురాణములలో చెప్పబడిన అవతారములు కనుక చెప్పేవారిని బట్టి, వినేవారినిబట్టి దాని అర్ధము మారిపోతూ ఉంటుంది. అదే ఈ వ్యాసానికి ప్రధానాంశము.
పురాణాలు అనువాద ప్రధానాలు. అనగా స్వంత అనుభవాలమీద నిర్మితమయినవి. ఉదాహరణకు మనిషిలాగానే దేవునికి పుట్టుక, పెళ్లి, పిల్లలు, సంపదలు అన్ని ఉంటవి. కానీ దేవుడు కనుక మరింత గొప్పగా ఎక్కువగా ఉంటవి. ఉపాసనలు రూపక ప్రధానములుగా ఉంటవి. ఉదాహరణకు సూర్యుడు ఏడుగుర్రాల రధమెక్కుతాడు. అంటే సూర్యకాంతిలో వుండే ఏడురంగులే (ఇంద్రధనుస్సులో లాగా) అని అర్ధము. ఉపనిషత్తులు అపవాద ప్రధానమయినవి. అధ్యారోప అపవాద న్యాయము ద్వారా అన్నిటిని నిరాకరించి తత్వజ్ఞాన మేమిటో తెలుపుతవి. ఈ అవతారాన్నికూడా అలానే అర్ధము చేసికోవాలి.
ఇక వామనావతారానికి వస్తే అందరిలాగానే వామనమూర్తి కూడా పుట్టాడు. దేవుడు కనుక వున్నపళముగా వటుడిగా మారిపోయాడు. యజ్ఞోపవీతము వగైరా సామగ్రి క్షణములో జరిగిపోయినవి. ఇక కార్యక్రమము ప్రకారము బలిచక్రవర్తి దగ్గరకు భిక్షకు బయలుదేరాడు(రాక్షసులను అణగద్రొక్కటము కోసమే వచ్చాడు కనుక).
ఇక శుక్రాచార్యుని వైపు దృష్టి మళ్లిస్తే శిష్యునిపై ప్రేమ, రక్షించాలని తపన, బాధ్యత కూడా. ఎలా అంటే మాట తప్పవచ్చంటాడు మహానుభావుడు. కానీ బలికి అది కంటకప్రాయముగా మారింది. శుక్రాచార్యుల దృష్టిలో మూడడుగులు ఇచ్చేస్తే ఆత్మనాశనము జరుగుతుంది. కానీ బలిచక్రవర్తి దృష్టిలో అది అహంకార నాశనము మాత్రమే. భగవంతునిలో విలీనమవటమే. అందుకే గురువును ధిక్కరించాడు. వామనుడికి, బలికి మధ్యలో ఒప్పందం మూడడుగులు మాత్రమే. కానీ మూడడుగులు తీసికోలేదు. భగవంతుడు ఒప్పందం ప్రకారము నడచుకోలేదనుకోవాలా ఇక్కడ? కాదు. దానికి అర్ధము వేరే వుంది. ఇక్కడే పురాణము, తత్వము వేరు అయ్యేది. వామనుడు త్రివిక్రముడై కొలుస్తాడు. అహము, మమ, వదిలించడమే వామనుడి ప్రధాన లక్ష్యము. ఈ రెండూ వదిలిన తరువాత మిగిలేదేమిటి?
“మమ” వదిలించడానికి రెండడుగులు ఖర్చు అయ్యింది. ఒక అడుగు ఇహలోకము అంటే ఇల్లు, వాకిలి, రాజ్యము వగైరా. రెండవ అడుగు ఊర్ధ్వ లోకాలకు సంబంధిచినది. పుణ్య పాపాలు, స్వర్గ కాంక్ష. మొదటి అడుగు మూలముగా ఇహము మనస్సులో నుండి వెళ్లి పోయింది. మనస్సుకు అంటకుండా ఉండిపోయింది. ఇదే అస్పర్శ యోగము. రెండవ అడుగులో పరలోకము పోయింది. అంటే స్వర్గభోగములు, కోరికలు కూడా పోయినవి. ఇక మూడవ అడుగు ఎక్కడ పెట్టాలనే ప్రశ్న వచ్చింది. శుక్రాచార్యుడు కన్ను పోగొట్టుకోవాలిసి వచ్చింది. తలపై పెట్టమన్నాడు బలి. అడిగేవాడికి ఇచ్చేవాడు లోకువేకదా మరి. దీనిలో అంతరార్ధమేమిటంటే అహంకారము తలలో ఉంటుంది. తలపై పాదము మోపగానే అహంకారము కూడా సమర్పించాడు బలి. దీనితో బలిదానం సంపూర్ణమయ్యింది. పరబ్రహ్మ స్వరూపమై మిగిలాడు బలి చక్రవర్తి. ఇప్పుడు బలి ఏమి లేనివాడు కానీ అంతా వున్నవాడు, అంతటా వున్నవాడు. సర్వాత్మభావము ఆత్మనాశనము కాదని తెలిపాడు, నిరూపించాడు.
మరి శుక్రాచార్యుడో? మనము గురువు చెప్పిన దారిలో వెళ్లాలా లేదా శిష్యుడు చేసిన దారిలో వెళ్లాలా మనమే నిర్ణయించు కోవాలి. పురాణ కధ కావాలా లేదా ఆత్మజ్ఞానము కావాలా ఎవరికివారే నిర్ణయించుకోవాలి.