Telugu Essays 1-20
- 1. పలకలేని వాళ్ళు పలికితే ఎలావుంటుంది
- 2. అందము ఆనందము
- 3. అసంగత్వము
- 4. ఒక అనామిక ఆక్రందనము
- 5. పెద్దల సుద్దులు
- 6. కడుపే కైలాసము, ఇల్లే వైకుంఠము
- 7. భయము
- 8. మార్పు
- 9. ముహుర్తములు ఏమిటి ఎందుకు అవసరమా
- 10. ముక్తి
- 11. వామన మూర్తి - పౌరాణిక దృష్టి, తాత్విక దృష్టి
- 12. ఒక సుమబాల గోల
- 13. చావు ఎవరినీ చంపదు
- 14. కృష్ణుణ్ణి అర్ధము చేసికోవటం ఎలా ? ఇలా !!
- 15. గ్రహములు మంచివా, చెడ్డవా?
- 16. నేనెవరిని
- 17. నేను చేసానా లేక అది జరిగినదా?
- 18. వైరుధ్యములో దాగిన సత్యము
- 19. పాల సముద్రము/ క్షీర సాగరము
- 20. నా ప్రార్ధన
కృష్ణుణ్ణి అర్ధము చేసికోవటం ఎలా? ఇలా!!
కృష్ణావతారము పూర్ణావతారమని చెప్పబడుతుంది. చాలామందికి ప్రియమయిన కృష్ణ నామము గర్గ మహర్షి భగవానునికి ఇచ్చిన నామము. బాలకృషుని లీలలు చూసి సంతసించని వారుండరు. నందగోకులములో పసి బిడ్డగా వున్నప్పటినుండి శత్రుసంహారము మొదలయ్యింది. అప్పటినుండి అవతార సమాప్తి వరకు తన మాటలతో, చేతలతో, ప్రవర్తనతో, భక్తులకు, ప్రజలకు మార్గదర్శకుడయి నిలిచాడు.
కానీ కొన్ని విమర్శలకు లోనవ్వడము భగవంతునికి కూడా తప్పలేదు. గోపికా వస్త్రాపహరణం సమయానికి ఎనిమిది లేదా తొమ్మిది సంవత్సరాల వయస్సు. దేహభావాన్ని గోపికలకు లేకుండా చెయ్యటానికి చేసిన పని వస్త్రాపహరణము. చేస్తున్న కర్మ వేదోక్తముగా, నియమబద్ధముగా చేయమని చెప్పడానికి చేసిన పని. కాత్యాయనీ వ్రతము చేస్తూ స్త్రీలు నగ్నముగా నదిలో దిగకూడదని , దేహభావము వదలమని చెప్పటానికి చేసిన క్రీడ అది. మామూలు మనిషికి కూడా ఎటువంటి శరీర సంబంధమయిన కోరికలు ఉండని వయస్సు అది. ఇక భగవంతుని గురించి వేరే చెప్పాలా? కానీ దీనిని కొంతమంది మరొకలా విమర్శించారు. బోధలు చేసి బాధలు తీర్చినందుకు మిగిలినది విమర్శ.
అలాగే అందరిలాగే పుట్టి చచ్చే మనిషిగా చూసి ఆయన బహుభార్యత్వాన్ని విమర్శించారు. కానీ దాని అర్ధము -
కృష్ణ - పురుషః
ప్రకృతి - మాయ
మాయ మూలముగా ప్రకృతిలో కనిపించే అష్టభావనలు - పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, జీవుడు కలిసి ఎనిమిది. ఈ ఎనిమిది ఎనిమిది మంది భార్యలలాగా అర్ధము చేసికోవాలి. లేదా పంచభూతములు, మనస్సు, బుద్ధి, అహంకారము కలిపి ఎనిమిది. (భ.గీ. 7.4)ఈ ఎనిమిది ఎనిమిది మంది భార్యలలాగా అర్ధము చేసికోవాలి. భగవానుడు గీతలో ప్రతి జీవిలోను బీజము తానే అని చెప్పాడు కదా. అనంత శబ్దానికి సంకేతము సహస్రము. అనంత జీవులు ఆయన అధీనములో వున్నారు. కనుక పదహారువేల భార్యలు దానికి సంకేతము. కృష్ణుని బహుభార్యత్వాన్ని ఇలా అర్ధంచేసికోవాలి. ఈ విషయాలు అర్ధము చేసికోకుండా ఆయన బహుభార్యలు కలవాడని నిందిస్తారు. భగవద్గీత చదివిన వాళ్ళందరూ దానిలో ఇమిడిన ఈ సారాంశము తప్పక గ్రహించాలి కానీ, మరొకలా అర్ధము చేసికోకూడదు.
పాండవులకు అండగా నిలిచి, కష్టాలలో ఆదుకుని, అశ్వమేధయాగాలు చేయించి, రాయబారిగా నిలిచి, అర్జునికి సారధ్యము చేసాడు యుద్ధములో. ఆఖరుకు పరిక్షిత్తును రక్షించి కురువంశము నిలబెట్టాడు. పాండవులలో నేను ధనంజయుడిని అని చెప్పాడు. స్వయముగా గీతను అర్జునికి బోధించాడు. కానీ పాండవులు కృషుని భగవంతుడిగా అర్ధము చేసికొన్నారా లేదా బావగా, బంధువుగా, స్నేహితుడిగా, హితుడిగా అర్ధము చేసికొన్నారు కానీ, భగవంతుడిగా దర్శించారా అనేది సందేహము. గీతను అర్ధము చేసికొన్నాను(నష్టో మోహః శ్రుతిర్ లభ్దా భ .గీ .18.73). అన్న అర్జునుడు కూడా కృష్ణుని అవ్యక్త స్వరూపునిగా, అనంతునిగా అర్ధము చేసికొన్నాడా అనేది సందేహాస్పదము. ఎందుకంటే పాండవులు స్వర్గానికి వెళ్లారని చెప్పబడింది కానీ, జన్మరాహిత్యము పొందారని చెప్పబడలేదు. తమ స్వరూపాన్ని అర్ధము చేసికొని జ్ఞానము పొందితే, జన్మరాహిత్యము కలగాలికదా. జ్ఞాని తన స్వరూపమేనని కృష్ణుడు గీతలో చెప్పాడుకదా(భ.గీ. 7.18).
యదువంశీయులందరు కృష్ణుని తమ వంశమువాడని, మహానుభావుడని, తమకంటే ఉన్నతమయినవాడని భావించారు కానీ, భగవంతునిగా దర్శించలేదు. దానికి అవతార సమాప్తికి ముందు వారి ప్రవర్తనయే నిదర్శనము. కృష్ణుడు షోడశ కళా పరిపూర్ణుడు అని చెప్పబడుతాడు(షోడశకళాపురుషః - అయిదు జ్ఞానేంద్రియంలు, అయిదు పంచేంద్రియములు, పంచ ప్రాణములు, అంతఃకరణ కలిసి పదహారు). షోడశ కళలు - దయ, సహనము, క్షమ, న్యాయము, నిష్పక్షపాతము, నిరసక్తి, తపస్సు,అజేయము, ధనశీలత, సౌందర్యము, నాట్యము, సంగీతము, నీతి, సత్యము, సర్వజ్ఞత, సర్వ నియంత. ఇవి భగవంతుని లక్షణాలు. ఈ విషయము అర్ధము చేసికొంటే వారి ప్రవర్తన మరొకలా ఉండేది. వంశ నాశము జరిగేది కాదు. అందరూ ముక్తులై తరించివుండేవారు. కానీ కృష్ణుడు జోక్యం చేసికోలేదు. ఎందుకంటే జనావళికి అసంగత్వము నేర్పటానికి. అహంకార మమకారములు మంచివి కావని బోధించడానికి.
“అవజానంతి మాం మూఢాః మానుషీమ్ తనుమాశ్రితమ్ |
పరంభావమజానంతో మమ భూత మహేశ్వరమ్ ||” అన్నాడు కృష్ణుడు(భ.గీ. 9. 11)
నా సర్వ వ్యాపకమయిన సత్తా స్వరూపమును(తత్వము) ఎరుగని మూఢులు నేనొక మానవాకారములో వున్నానని భ్రాంతి పడి, తక్కువగా వూహింతురు. లోక కళ్యాణము కోసము అవతారములు ఎత్తినానని విస్మరింతురు. కనుక కృషుని భగవానునిగా, మహేశ్వరునిగా అర్ధము చేసికోవాలి కానీ మానవునితో పోల్చి ఆయన చేసినది సరి అని, కాదని విమర్శించ కూడదు.
“అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః |
పరంభావమజానంతో మమావ్యయమనుత్తమమ్” అన్నాడు గీతాచార్యుడు(భ.గీ. 7.24)
నేను శాశ్వతుడను, సర్వోత్తముడను, ఇంద్రియ మనస్సులకు గోచరింపని వాడను. నా పరమ భావమును బుద్ధిహీనులు గ్రహింపక సచ్చిదానంద పరమాత్ముడయిన నన్ను జననమరణచక్రములలో బంధించబడిన సామాన్య మానవునిగా తలచెదరు. ఈ రకముగా ఎన్నోచోటల తనను ఎలాఅర్ధము చేసికోవాలో తానే చెప్పాడు. వినే వారెందరు?
"పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్క్హృతాం, ధర్మసంస్థాపనార్దాయ సంభవామియుగే యుగే"(భ.గీ 4.8) అని చెప్పాడు, చేసాడు. ఇది మనస్సులో ఉంచుకొని, భగవానుని అవ్యక్త రూపము, స్వరూపాన్ని అర్ధము చేసికొని పరంధామము, పరమాత్ముని సన్నిధి చేరడము ధ్యేయముగా పెట్టుకోడమే కృష్ణుని సరిగ్గా అర్ధము చేసికోడమవుతుంది. పరంధామము అంటే స్వర్గము కాదు. స్వర్గమునకు వెళ్లిన వాళ్ళు తప్పక మళ్ళీ మళ్ళీ జన్మనెత్తక తప్పదు. బాధలతో, బరువులతో, అహంకార మమకారములతో కూడిన జీవితము గడపక తప్పదు. “క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతే” అని స్పష్టముగా చెప్పాడు గీతాచార్యుడు(భ.గీ. 9.21) ఇది ఎవరికీ వారు నిర్ణయించుకోవాలిసిన విషయమే కానీ, మరొకరు పోతున్న దారిలో పోవలసిన విషయము కాదు.
“ఉద్ధరేత్ ఆత్మ ఆత్మానం” అన్నాడు కదా గీతాచార్యుడు(భ.గీ. 6.5).