Telugu Essays 1-20
- 1. పలకలేని వాళ్ళు పలికితే ఎలావుంటుంది
- 2. అందము ఆనందము
- 3. అసంగత్వము
- 4. ఒక అనామిక ఆక్రందనము
- 5. పెద్దల సుద్దులు
- 6. కడుపే కైలాసము, ఇల్లే వైకుంఠము
- 7. భయము
- 8. మార్పు
- 9. ముహుర్తములు ఏమిటి ఎందుకు అవసరమా
- 10. ముక్తి
- 11. వామన మూర్తి - పౌరాణిక దృష్టి, తాత్విక దృష్టి
- 12. ఒక సుమబాల గోల
- 13. చావు ఎవరినీ చంపదు
- 14. కృష్ణుణ్ణి అర్ధము చేసికోవటం ఎలా ? ఇలా !!
- 15. గ్రహములు మంచివా, చెడ్డవా?
- 16. నేనెవరిని
- 17. నేను చేసానా లేక అది జరిగినదా?
- 18. వైరుధ్యములో దాగిన సత్యము
- 19. పాల సముద్రము/ క్షీర సాగరము
- 20. నా ప్రార్ధన
భయము
భయము లేదా భీతి అనేది ప్రతి మనిషి జీవితములోను కలుగుతుంది. కొంతమందికి ఎక్కువసార్లు కావచ్చు మరి కొంత మందికి తక్కువసార్లు కావచ్చు. అది విపరీతముగా వుండి బాధ పెట్టవచ్చు లేదా దుఃఖాన్ని కలిగించవచ్చు. దీనికి కారణాలను పరిశీలించి, వివేకముతో అలోచించి దుఃఖనివారణ చేసుకోవాలి. చేసుకోవచ్చు.
మనస్సులో కలిగే చలనమే భయము. మనస్సులో కలిగే కామనలు లేదా కోరికలనుండి భయము కలుగుతుంది. కోరికలు ఫలించినప్పుడు, ఫలించనప్పుడు కూడా భయము కలుగుతుంది. ఉదాహరణకు ధనము లేనప్పుడు రేపు ఎలా గడుస్తుంది అనే భయము ఉంటుంది. ధనము సంపాదించినప్పుడు అది పోతుందేమోనని భయము. లేదా తన బిడ్డలు కానీ, మరెవ్వరయినా కానీ ధనము అపహరించడము కోసము తనకు హాని కలిగిస్తారేమో అనే భయము ఉంటుంది. కనుక కోరికలను, దురాశను మనస్సునుండి దూరముగా పంపాలి, మళ్ళీ రాకుండా చూసుకోవాలి.
భయానికి మరొక కారణము ఏమంటే, భవిషత్కాలానికి సంబంధించిన ఊహలు. రోగమొస్తుందేమోనని భయము. లేదా చావు వస్తుందేమోనని భయము. నేను దేహాన్ని కాను సచ్చిదానంద స్వరూపాన్ని అనే జ్ఞానమే ఈ భయాన్ని పోగొట్ట గలదు. మృత్యువు నిజముగా ఎవరిని బాధించదు. మృత్యుభయము విపరీతముగా భయపెడుతుంది కొందరిని.
కదిలే కాలములో కదులుతున్న మనిషి కాలము గురించి భయపడతాడు. పనులు చేసే ముందు ముహూర్తము పెడతారు. ఎందుకంటే అనుకున్నది అనుకున్నట్లు శుభప్రదంగా జరుగదేమోనని భయము. అన్ని పనులూ ముహూర్తము పెట్టినంతమాత్రముగా సక్రమముగా జరగవు కదా. ఇటువంటివి, వివేకము ఉపయోగించి తెలుసుకొని, కాలములో ఏమిలేదు, ఇది కేవలము మనస్సు కల్పించిన చిత్త విభ్రంశము మాత్రమే అని నిర్ధారించుకోవాలి. కోరికలు గాలిమేడలు కట్టకపోతే కూలిపోతయ్యనే భయము ఉండదు.
భయానికి రాగద్వేషాలు మరొక కారణము. ఒకరి పైన రాగము, అనురాగము ఉంటే వారికి ఏదయినా అశుభము జరుగుతుందేమోననిగాని, చనిపోతారని గాని ఆలోచన కలిగితే అది భయాన్ని సృష్టిస్తుంది. ఒకవేళ ఒకరిపైన ద్వేషము ఉంటే అతనివలన మనకేమి కీడు జరుగుతుందో అని భయము కలుగుతుంది. జరగవలసింది జరుగుతుందిలే అని భగవంతుని పైన భారము వేసి జీవితాన్ని నడుపుకోగలినప్పుడే ఈ భయము తొలగుతుంది. కర్మ చెయ్యడానికి మనకి అధికారము వుంది కానీ, కర్మ ఫలముపైన మనకి అధికారము లేదని గదా గీతాచార్యుని బోధ. కర్మఫలాన్ని ఆశించినప్పుడు అది రాదేమో అని భయము. భయాన్ని గురించి కృష్ణ పరమాత్మ సాంఖ్య యోగములోను(56వ శ్లోకము-- వీతరాగ భయ క్రోధః స్థితధీర్మునిరుచ్యతే) రాగము, భయము, క్రోధము లేకుండా సమమయిన బుద్ధి కలవాడు, మననశీలుడు స్థిత ప్రజ్ఞుడనబడుతాడు అని, జ్ఞానయోగములోనూ(10వ శ్లోకము - వీతరాగ భయక్రోధా మన్మయామాసముపాసతే) రాగ భయ క్రోధాదులను పోగొట్టుకొని జ్ఞానమనే తపస్సుచే నన్ను పొంది, తరించిపోతారు అని ప్రస్తావించాడు. అభయమిచ్చాడు
దైవ భక్తి స్థిర చిత్తము పొందటానికి ఉపయోగపడుతుంది. దైవముపైన భారము పెట్టి మనపనులు మనము చేసికోపోవటానికి ఉపయోగపడుతుంది. అంతేకాని భక్తి చెయ్యకపోతే, దేవుడు శిక్షిస్తాడేమో అనే భయముతో భక్తి చెయ్యరాదు. భగవంతుడిని చూసి భయపడేవాడు భయాన్ని ఎలా పోగొట్టుకొంటాడు? భగవంతుడి పని శిక్షించడము కాదుగదా. అభయ ప్రదాత అభయస్థితిని ప్రసాదిస్తాడు. ఇది ఒకరకంగా చూస్తే బ్రహ్మ జ్ఞానానికి దారి.
మనకన్నా వేరుగా వున్నవి మాత్రమే మన భయానికి కారణమవుతవి. మనస్సులో కలిగే రాగద్వేషాలు ఎప్పుడూ బయటి విషయాలు లేదా వ్యక్తుల గురించి మాత్రమే. ఇవి భయ హేతువులు. కనుక వీటిని అర్ధము చేసికొని నిర్మూలన చెయ్యాలి. ద్వైతపరముగా ఆలోచించినప్పుడే భయము. అద్వైతము అభయ స్థితి. ఉన్నది ఒక్కటే అయినపుడు భయము ఎవరినుండి ఎట్లా వస్తుంది? తాను దేహము కాదని తెలిసికొన్న జ్ఞాని, ఇతర దేహాలనుండి తనకు కలిగే కష్టాలను ఊహించడు. కనుక భయము అతని జోలికి పోదు. అద్వయుడు కనుక అభయస్వరూపుడవుతాడు.
స్వామీ వివేకానంద భయము గురించి ఇలా అన్నారు. “The only religion that ought to be taught is the religion of fearlessness”. “Fear comes from the selfish idea of cutting oneself off from the universe.”
ముగించేముందు ఒక ఆంగ్లేయుని వాక్యము గుర్తుంచుకోవచ్చు. "The only thing that one should be afraid of is fear itself - by Oscar Wilde."