గ్రహములు మంచివా, చెడ్డవా?

వరాహమిహిరుని లాంటి జ్యోతిషశాస్త్ర పండితులు పుట్టిన దేశములో శాస్త్రాన్ని అస్తవ్యస్తము చేసి స్వప్రయోజనానికి వాడుకొంటున్న నామమాత్ర పండితులు ఈ రోజున భారత భూమిలో వెలిగి పోతున్నారు.సాధారణ మానవులు వివేకముమరచి ఆ సుడిగాలిలో పడి కొట్టుకు పోతున్నారు. ఎక్కడికి? వారికే తెలియాలి .

రాహువు, కేతువు గ్రహణము కలిగిస్తారని, అది మంచి సమయము కాదని, గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదని ఇలా ఎన్నెన్నో కధలు సృష్టించారు. రాహువు సూర్యుడిని కప్పగలదా? భూమి, చంద్రుడు కదలికలో వచ్చే మార్పుల మూలముగా వచ్చే గ్రహణము ఎలా చెడ్డ సమయము అవుతుంది?

ఇక వార ఫలాలు, మాస ఫలాలు చదివే వారందరికీ పరిచయమయిన విషయము ఏమంటే రాహువు, కేతువు, శని, కుజుడు చెడ్డ గ్రహములలాగా వర్ణించబడుతవి. ఫలానారోజున పుట్టిన వారికీ ఫలానా కష్టము, నష్టము, ఫలానా సమయములో కలుగుతుందని మొదలయిన వర్ణనలు చేస్తారు. సత్యమేమిటి అని ఆలోచించేవారు ఎందరు? దీనికి రుజువు ఏమయినా వుందా అనే ఆలోచనే కలుగదు.

రాహువు, కేతువు, శని, కుజుడు కాకుండా నిజముగా మనిషిని బాధించేవి, నష్టము కష్టము కలిగించే గ్రహములు నాలుగు వున్నవి. అవి ఏమంటే ఆగ్రహము, విగ్రహము, పరిగ్రహము, సంగ్రహము.

ఆగ్రహము అంటే కోపగించుకోవటం. కోపము గురించి గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పినది గుర్తు చేసికొంటే అప్పుడు ఇది రాహు కేతువులకంటే, శనిగ్రహము కంటే ఎక్కువ నష్టము కష్టము కలిగిస్తుంది అని తెలుస్తుంది. మరొకరికి వున్నది నాకు లేదను కొంటే క్రోధము కలుగుతుంది క్రోధము వలన వ్యామోహము కలుగుతుంది. దానినుండి స్మృతిభ్రష్టము. దానినుండి బుద్ధి లేదా జ్ఞానము నశిస్తుంది(భ.గీ 2.63). మిధ్యాద్వైతము సత్యమనే పట్టుదల కూడా ఆగ్రహమని చెప్పబడుతుంది.

విగ్రహమంటే కలహము లేదా యుద్ధము. దీనినుడి వచ్చే నష్టము, కష్టము అందరికి తెలిసినవే.

సంగ్రహము అంటే ధనము విపరీతముగా ప్రోగు చెయ్యటమే. ధనము అవసరము కొంతవరకే కానీ జీవితాంతము ధనసంపాదన నుండి కలిగే చేదు ఫలితాలు లెక్కకు మించినన్ని వున్నవి. విత్తము తెచ్చే విపత్తులు ఎవరయినా ఊహిస్తే బహుశా తమ అభిప్రాయము మార్చుకొనే అవకాశము ఉంటుంది.

పరిగ్రహము అంటే అవసారానికి మించిన వస్తువులను ప్రోగు చేసి దాచిపెట్టటము. ప్రపంచములో వున్న వస్తువులకు ఒక పరిమితి వుంది. కొంతమంది విపరీతముగా దాచిపెట్టడము మూలముగా మరికొంతమందికి సరిపడినన్ని లేకుండా పోతున్నవని అర్ధము చేసికోవాలి.

మరి మంచిగ్రహము ఏదయినా వుందా అంటే, నిగ్రహము అని చెప్పాలి. ఎందుకంటే కోపము వస్తే దానికి కళ్లెము వేసి ఎవరినీ బాధించేలాగున మాట్లాడకుండా ఉండగలగటము. కోపము వచ్చినప్పుడు దానిని ఆపగలిగితే శత్రువులు వుండరు. కోపము కలిగించినవాడు కూడా బాధపడి స్నేహితుడయ్యె అవకాశము ఉంటుంది. లేదా ధన సంపాదన విషయములోకానీ, వస్తువుల విషయములో గానీ నా అవసరానికి మించి ప్రోగు చేస్తున్నానా అని అలోచించి, ఆపగలగాలి. అలాగే కలహములోకి దిగవలసిన పరిస్థితులలో చల్లబడి అర్ధము చేసికోగలగటము ఇవన్నీ నిగ్రహము అని అనుకోవచ్చు. దీని వలన జరిగేదంతా మేలు కనుక ఇది మంచి గ్రహం అని చెప్పవచ్చు.

కనుక గ్రహణము అంటే రాహు కేతువులు కాదని, ఇక్కడ చెప్పబడిన నాలుగు గ్రహములు ఆత్మచైతన్యమును కప్పివేయటమే గ్రహణము. అందుకే గ్రహణము చెడు అని చెప్పడము. స్వప్రకాశ ఆత్మచైతన్యము నివురు కప్పిన నిప్పులాగా ఉండిపోతుంది. కనుక ద్వైత ప్రపంచములో పడి మానవుడు కొట్టుమిట్టాడుతూ జీవిత పర్యంతమూ దుఃఖిస్తూ గడుపుతాడు. గ్రహణము తరువాత చేసి శాంతి వగైరా ఏమంటే, అరిషట్వర్గాలను వదిలించుకొని ఆత్మస్వరూపాన్ని అర్ధము చేసికొని పరమాత్మలో విలీనమయిపోవటమే.

ఇది గ్రహపాటా లేదా మన పొరపాటా !!!