Telugu Essays 1-20
- 1. పలకలేని వాళ్ళు పలికితే ఎలావుంటుంది
- 2. అందము ఆనందము
- 3. అసంగత్వము
- 4. ఒక అనామిక ఆక్రందనము
- 5. పెద్దల సుద్దులు
- 6. కడుపే కైలాసము, ఇల్లే వైకుంఠము
- 7. భయము
- 8. మార్పు
- 9. ముహుర్తములు ఏమిటి ఎందుకు అవసరమా
- 10. ముక్తి
- 11. వామన మూర్తి - పౌరాణిక దృష్టి, తాత్విక దృష్టి
- 12. ఒక సుమబాల గోల
- 13. చావు ఎవరినీ చంపదు
- 14. కృష్ణుణ్ణి అర్ధము చేసికోవటం ఎలా ? ఇలా !!
- 15. గ్రహములు మంచివా, చెడ్డవా?
- 16. నేనెవరిని
- 17. నేను చేసానా లేక అది జరిగినదా?
- 18. వైరుధ్యములో దాగిన సత్యము
- 19. పాల సముద్రము/ క్షీర సాగరము
- 20. నా ప్రార్ధన
కడుపే కైలాసము, ఇల్లే వైకుంఠము
ఈ నానుడి(Idiom) ఎవరు సృష్టించారో తెలియదు, మరీ ఎక్కువగా వినపడదు. కానీ కొంతమంది మనుష్యులను కదలిస్తే, ముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితము గురించి ప్రశ్నిస్తే వచ్చే సమాధానము పైన చెప్పబడినది. అంటే వారి ఉద్దేశములో వైకుంఠముగానీ, కైలాసముగాని చేరితే జీవితములో ఇంకా కావలసినది లేదనా, లేక ఆ స్థలాలు చేరటానికి కావలసిన సామాగ్రి సమకూర్చుకుంటానికి కూడా సమయము చాలడము లేదనా?
సమయాన్ని సద్వినియోగము చేసికొనేవారికి మంచి అలవాట్లు అబ్బుతాయి. సమయాన్ని సద్వినియోగము చేసుకోకపోతే మరి ఆ పోయిన సమయము రాదు. బంగారములో ప్రతిముక్కకి విలువవున్నట్లే, జీవితములో ప్రతిక్షణానికి విలువ ఉంటుంది. కీళ్లు లేని కాళ్ళు నడవడానికి పనికిరానట్లే క్రమశిక్షణ లేని వ్యక్తి దేనికీ పనికిరాడు. దమ్మిడీ ఆదాయము లేదు, క్షణము తీరిక లేదు అని విసుగు చెందుతూ డబ్బుకు లోకము దాసోహము అంటుంది కనుక ధనసంపాదనే ప్రధమ లక్ష్యముగా పెట్టుకున్నవారే పైన చెప్పిన మాటలు బహుశా పలుకుతారు. ఆకాశానికి హద్దులు లేనట్లు వీరి ధనసంపాదనకు అంతము ఉండదు.
అదేమంటే అవసరాలు తీరొద్దా అని ప్రశ్నిస్తారు. అవసరాలు క్రొత్త దారులు వెతికితే అనుభవాలు క్రొత్తపాఠాలు నేర్పిస్తాయి. మనిషి పుట్టిన మరొక క్షణమునుండీ మరణించడము మొదలవుతుంది. దీపము ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచన ఉండదు. కనుక ఆయుష్షు, ఆరోగ్యము ఉండగానే వైకుంఠము, కైలాసము ఒక ప్రక్కన పెట్టి, దైవ భక్తి అలవర్చుకుని, మనము ఎక్కడనుండి వచ్చాము, ఈ బాధలు, బంధాలు ఎందుకు కలుగుతున్నవి అని ఆలోచిస్తే అప్పుడు దారి దొరుకుతుంది.
ఐన్ రేండ్(Ayn Rand-Alisa Zinov'yevna Rosenbaum-a Russian American writer, and a philosopher) అనే ప్రముఖ నవలాకారిణి, తత్వశాస్త్ర వేత్త, ఇలా అంది. "జీవితము యొక్క నైతిక ప్రయోజనము, మీయొక్క నైతిక సమగ్రతకు, విలువల పట్ల మీ యొక్క నిబద్ధతలకు సాక్ష్యము అయిన ఆనందాన్ని సాధించడమే!! ఆ ఆనందము ఎప్పుడూ ఒక ఇష్టము లేని బాధ్యత, ఒక బుద్ధి హీనుని ఆనందము కాదు". ఇది తరతరాలుగా మన మహర్షులు బోధించిన సత్యము. సత్యజ్ఞానందస్వరూపమయిన నిన్ను నీవు తెలుసుకొంటే, మాయాప్రపంచము, అది కలిగించే బాధలూ, అదృశ్యమయిపోయి, కేవలము ఆనందము మిగులుతుంది. ఇది మరొకరివలన, మరొకదానివలన కలిగే ఆనందము కాదు. కేవలము స్వరూపానందము. మరి ఇలాంటి దారిలోకి వెళ్లాలంటే మాకు సహాయము చేసేవారెవ్వరూ లేరే అనొచ్చు. దానికి ఆంగ్లమహాకవి విలియం షేక్స్పీర్(William Shakespeare) ఇలా అన్నాడు. “నన్ను నేను నమ్ముకున్న ప్రతి సారీ విజయము నన్నే వరించింది. ఒకరిపైన ఆధారపడిన ప్రతిసారి నన్ను నేను నిందించుకోవలసి వచ్చేది. చివరికి నాకర్ధమయ్యింది ఏమంటే స్వశక్తికి మించిన ఆస్తి లేదని". మహామహుల వాక్యాలు సామాన్యులు అనుసరించడానికి కదా?
ఆపదలో దేవునికి మొక్కులు, సంపదలో దేవునికి మొట్టికాయలు అన్నట్లు కాకుండా, ఎప్పుడో ఒకప్పుడు ఆధ్యాత్మిక మార్గానికి అలవాటు పడాలి మానవుడు. ఎంత మంచి పని అయినా ఆరంభములో అసంభవముగానే కనపడుతుంది. ఏ పని అయినా స్వశక్తి, సంకల్పము పైననే ఆధారపడివుంటుంది. తెలివయినవాడు పరిస్థితులను తనకు అనుకూలముగా మలచుకొంటాడు. కార్య సాధకుడు కృషితోనే విజయము సాధించుకొంటాడు. సోమరి దాన్ని అదృష్టానికి అంటగడతాడు. ఆలోచన లేనివానికి అభివృద్ధి ఉండదు. జీవితము సమస్యల సమాహారం(collection), అది పరిష్కరించగలిగితే అది మణిహారమవుంతుంది అన్నారు పెద్దలు. వైఫల్యాలతో పలువురు వెనుదిరుగుతారు. పట్టుదలతో కొంతమంది అక్కడనుండి విజయ యాత్ర సాగిస్తారు.
కొంతమందికి, పువ్వు పుట్టగానే పరిమళించినట్లు, వారి పూర్వజన్మ సంస్కారమును బట్టి, చిన్నతనమునుండే వైరాగ్యము, ఆధ్యాత్మిక చింతన మొదలవుతాయి. ఋజువర్తనము, సత్యము పలకడము అలవాటు చేసికోవాలి. ఎన్ని పుస్తకాలు చదివాము అనేకంటే ఎటువంటి పుస్తకాలు చదివాము అని ఆలోచించి, పుస్తకాలనుండి మస్తకానికి ఎక్కించి, దాన్ని ఆచరణలో చూపాలి. అప్పుడే సత్ఫలితాలు కలుగుతవి. మంచి ఆలోచన వచ్చినా, మంచి పని చేద్దామనుకున్నా, దానిని తక్షణము అమలుజరపాలి. లేకపోతే, రావణుడు సీతమ్మను రామునికి అప్పచెప్పాలనుకుంటూనే, చేయకుండా లంక నాశనానికి కారకుడయ్యాడు. అలాగే మానవుడు తన జీవితాన్ని వృధా చేసుకుంటాడు.
ఈ దారిలో నడవాలని నిర్ణయించుకున్నాక, శాస్త్రీయ బ్రహ్మనిష్ఠుడయిన గురువుని అన్వేషించాలి. అదృష్టాన్ని పొందే ముందు దానికి కావలసిన అర్హత సంపాదించుకోవాలి. అదే దైవ భక్తి, తీర్ధయాత్రలు, దానధర్మాలు, జపము, ధ్యానము వగైరా చెయ్యడము మొదలైనవి. గురువంటే చీకటి పొరలు తొలగించి, మనలను బ్రహ్మ మార్గములో నడిపించేవాడు. మనము "అహంబ్రహ్మాస్మి" అనే అనుభూతి కలిగించుకునే వరకూ మనకు తోడుగా, నీడగా వుండి కైవల్యము చేర్చే పెన్నిధి. ఆచార్యుని అనుగ్రహముతో అక్షర దీపము వెలిగించుకుని, అజ్ఞానము అదృశ్యము చేసికొని, మాతృభాషను మరువకుండా, మన సంస్కృతిని విడువకుండా అందరూ కైవల్యము చేరుకోవాలి. సర్వులూ సద్గురువుని పొంది సన్మార్గములో నడచి, తరించుదురు గాక.
సర్వేజనా సుఖినోభవంతు.