చావు ఎవరినీ చంపదు

సామాన్య మానవుని దృష్టిలో చావు అంటే శ్వాస ఆగి పోయి చలనము లేకుండా పడి వుండడము. ఆ పదము ఉచ్చరించడానికి, ఆలోచించడానికి కూడా భయ పడుతారు మానవులు. దీనికి కారణమేమిటి?

దీనికి కారణము భయము. చావు అంటే అర్ధము తెలియక పోవటం. చావు అంటే స్థూల శరీరము సూక్ష్మ శరీరాన్ని వదిలిపోవటమే. ఇది అర్ధము కావాలంటే స్థూల శరీరమేమిటి? సూక్ష్మ శరీరమేమిటి అనేది తెలియాలి. స్థూల శరీరమంటే భౌతికంగా అందరికి కనపడే శరీరము. నామ రూపాలతో వ్యవహరించబడుతుంది. సూక్ష్మ శరీరమంటే మనస్సు. బుద్ధి, అహంకారము. ఇది బయట ఎవరికీ కనపడదు. ప్రతి వ్యక్తికి మనస్సు వున్నదని సంగతి తెలుసు. కానీ బుద్ధి అహంకారము అనేవి ఆలోచించిన వారికి, కొంత జ్ఞానము వున్న వారికి మాత్రమే అనుభవంలోకి వస్తుంది. శరీరములో జరిగే క్రియలన్నిటికి ఆధారము సూక్ష్మ శరీరము కనుక అది పోగానే ఇది పడిపోతుంది.

ఇక చావు అంటే ఎందుకు భయ పడతారంటే నాది అనుకొన్న ఆస్థి పాస్తులు, భార్య పుత్రాదులు, స్నేహితులు వగైరా అందరిని వదలవలసి వస్తుందని బాధ. ఇవన్నీ తాత్కాలికములని, మనము కల్పించుకొన్న బంధములని అర్ధము చేసికొంటే, అవి వదలటానికి బాధ ఏమి ఉండదు. దీనికి ఎక్కువ జ్ఞానము ఉండవలసిన అవసరము కూడా లేదు.

ఇక జ్ఞానపరముగా ఆలోచిస్తే, మొదటగా భగవద్గీత సాంఖ్య యోగము చదవాలి. లేదా విని నేర్చుకోవాలి. గీతాచార్యుడు అర్జునికి బోధించిన దేమంటే ఆత్మ వేరు, శరీరము వేరు. చావు శరీరమునకు గాని ఆత్మకు కాదు. ఆత్మ నిత్యము, శరీరము అనిత్యము. పుట్టినదేదయినా పోతుంది. మనిషి అయినా, మొక్క అయినా, జంతువు అయినా ఈ ప్రపంచములోని వచ్చినవన్నీవదిలి పోవాల్సినవే. దీనికి విచారించడము? భయపడటం దేనికి? (భ..గీ 2. 20, 23, 24,27) ఆత్మ అంటే అర్ధమయితే(ఆత్మ నిత్యము అనే సంగతి) అది కాలబడదు, తడప బడదు, ఎండబడదు అనే విషయము అర్ధమవుతుంది.

చావు అనే క్రియ ఒక్క క్షణములో జరుగుతుంది. కానీ మనిషి దాని గురించి జీవితమంతా భయపడుతూ ఉంటాడు. అంటే మనిషిని నిజముగా చంపేది చావుని గురించిన ఆలోచనే కానీ నిజముగా చావు కాదు. ఆలోచించిన ప్రతి క్షణము మనిషికి బాధ కలుగుతుంది. క్షణ క్షణము అది మనిషిని అంచలంచలుగా చంపుతూ ఉంటుంది.

మరొక రకముగా ఆలోచిస్తే, పుట్టినప్పటినుండి చచ్చేవరకూ ప్రతి క్షణములోనూ శరీరములో కొన్ని కణములు చనిపోయి మరి కొన్ని క్రొత్తవి వాటి స్థానములో తయారవుతూ ఉంటాయి. ఈ విషయము వైద్యులకు మాత్రమే తెలిసిన విషయము. కానీ అందరమూ అర్ధము చేసికొంటే, అప్పుడు చావు అనేది మరింత అవగాహనలోకి వస్తుంది. బాధ తగ్గుతుంది.

కాన్సర్ లేదా కొన్ని దీర్ఘరోగాలతో బాధపడేవారు కొద్ది మంది చావు త్వరగా వస్తే బాగుంటుంది అనుకొంటారు. వారికి లేని భయము మిగిలిన వారికి ఎందుకు కలుగుతోంది? కారణమేమంటే వారి ఆలోచనలో ఈ శరీరము ఎలాగూ పోవలసినదే కదా, తొందరగా పోతే బాధనుండి ఉపశమనము కలుగుతుంది అనేది ఒక కారణమయితే, ఈ శరీరము అనిత్యము అనే సంగతి వైరాగ్యముతో బాగా అర్ధము చేసి కొన్నారు కనుక.

మరొక రకముగా జ్ఞానముతో అర్ధము చేసికోవటం ఎలాగంటే, అసలు పుట్టిన తేదీ అనేదే లేదు. భూమి మీదకు వచినప్పుడా లేదా తల్లిగర్భములో ప్రవేశించినపుడా? ఇంకా ఆలోచిస్తే అంతకు ముందు కూడా తండ్రి వీర్యములో కణములాగా ఉంటాడు. ఇంకా చెప్పాలంటే ఇంకా ముందు పంచ భూతాలలో విలీనమయి ఉంటాడు. కనుక ఎప్పుడు పుట్టాడు? అలానే చచ్చాడు అన్న తరువాత పంచ భూతములలో వున్నాడు. కొద్ది సమయము తరువాత మరొక శరీరములో మళ్ళీ కనపడతాడు. ఎప్పుడూ అదృశ్యము కానీ వాడు చచ్చాడని ఎలా అంటాము? ఇంద్ర జాలికుడు చూపే గారడిలాగా కొంత సమయములో కనపడి మరికొంత సమయములో ఈ జీవుడు కనపడటంలేదు. గారడీ చూసి ఆనందిస్తాము కానీ చావు చూసి ఏడుస్తారు. దీనికి కారణము సరి అయిన అవగాహన లేక పోవటమే.

మరింత లోతుగా ఆలోచిస్తే, గౌడపాదాచార్యుల సిద్ధాంతము గురించి అధ్యయనము చేసి, ఆలోచించిస్తే అసలు ఈ ప్రపంచమే పుట్ట లేదు. నిద్రలో వచ్చిన స్వప్నము అసత్యము అని అందరు అంగీకరిస్తారు. కానీ ప్రపంచమంతా జాగ్రదావస్థలో జరుగుతున్న స్వప్నము లాంటిది అని అంటే అందరూ అంగీకరించలేరు. సృష్టియే జరగనప్పుడు ఇక అందులో వున్నమానవులు పుట్టేదేముంది? పోయేదెక్కడికి? అజాత వాదము అందరు ధైర్యముతో అంగీకరించ లేరంటే మొదటిది అధికార బేధము. పూర్తి అద్వైత జ్ఞానము కలిగిన వారు మటుకే దానిని సంపూర్ణముగా అంగీకరిస్తారు, ఆనందముగా వుంటారు. మిగిలిన వారికి జగత్తు, తద్వారా మానవులు పుట్ట లేదంటే, ధర్మ, అర్ధ, కామములనబడే పురుషార్ధములు ఏవి వుండవు. మనిషికి డబ్బులు సంపాదించడము, కోరికలు తీర్చుకోడమూ, ధర్మమూ, పూజలు వగైరా చేసి స్వర్గానికి పోవడము వగైరాలన్నీ చిన్నాభిన్నమయి పోతే మనిషి భరించలేడు. అందువలన పుట్ట లేదు అనే వాదము అందరు అంగీకరించరు. సత్యమును అంగీకరించి, ఆదరించే వారు అరుదు కదా. ఇక ఈ మనిషి ఏమిటి, చావు పుట్టుక లేమిటి, ఎవరికీ?

దుఃఖము లేకుండా వున్న నాలుగు రోజులూ ఆనందముగా ఈ భువిలో బ్రతకాలనుకొనే వారందరూ ఆలోచించవలసిన విషయాలు, అర్ధము చేసికోవాలిసిన విషయాలు. ప్రయత్నము కూడా చెయ్యని వారికీ మొదటినుండి చివరి వరకూ దుఃఖమే. తన చావు గురించి కావచ్చు లేదా తనకు సంబంధిచినవారు చనిపోయారనుకొన్నప్పుడు కానీ.