Telugu Essays 1-20
- 1. పలకలేని వాళ్ళు పలికితే ఎలావుంటుంది
- 2. అందము ఆనందము
- 3. అసంగత్వము
- 4. ఒక అనామిక ఆక్రందనము
- 5. పెద్దల సుద్దులు
- 6. కడుపే కైలాసము, ఇల్లే వైకుంఠము
- 7. భయము
- 8. మార్పు
- 9. ముహుర్తములు ఏమిటి ఎందుకు అవసరమా
- 10. ముక్తి
- 11. వామన మూర్తి - పౌరాణిక దృష్టి, తాత్విక దృష్టి
- 12. ఒక సుమబాల గోల
- 13. చావు ఎవరినీ చంపదు
- 14. కృష్ణుణ్ణి అర్ధము చేసికోవటం ఎలా ? ఇలా !!
- 15. గ్రహములు మంచివా, చెడ్డవా?
- 16. నేనెవరిని
- 17. నేను చేసానా లేక అది జరిగినదా?
- 18. వైరుధ్యములో దాగిన సత్యము
- 19. పాల సముద్రము/ క్షీర సాగరము
- 20. నా ప్రార్ధన
ఒక సుమబాల గోల
సుమము అంటే పుష్పము. మరి దానికి గోల ఏమిటీ? అది మాట్లాడలేదు కదా? అది చాలా సున్నితమైనది కదా? మనస్సును సున్నితమనో బండ మనస్సు అనో అంటారు. మనస్సులో భావాలు కదిలినట్లే పుష్పములో కూడా భావాలు ఉండొచ్చు కదా. తల్లినుండి తప్పిపోయిన బిడ్డ ఏడవకుండా ఉంటుందా? మరి చెట్టుకు లేదా మొక్కకు ప్రాణమున్నది కదా. మనము పువ్వులను కోస్తే, మొక్క బాధపడుతుందా అని ఆలోచిస్తే ఎవరయినా పువ్వులు కొయ్యగలుగుతారా? పువ్వులు ఏడుస్తున్నవేమో అనుకుంటే ఎవరయినా వాటిని తృంప గలుగుతారా? ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, ఒక్క భారత దేశములో తప్ప ఇట్లా తోటలు పెంచి, విధ్వంసము చేసి, పువ్వులతో వ్యాపారము చెయ్యటం(దేవుని పేరు మీదనో మరొక కారణముతోనో) ఇంకెక్కడా ఇంత పిచ్చి కనబడదు, ఉదాహరణకు పెళ్లి మంటపాలకు గాని, ఆ పందిరినిండా కానీ దండలు దండలు కట్టి, కొన్ని లక్షల్లో, కోట్లో పువ్వులు కోస్తే కానీ పెళ్లి జరగదా? ఈ ఆడంబరాలకు అంతు లేదా? ఇంత ఘ్ననముగా చేసిన పెళ్లి ఏడాదితిరిగే సరికి విడాకుల కోర్టులోనే గదా తేలేది. మానవులు ఎందుకు ఆలోచించరు? సంపద సంపాదించడము తప్పు కాదు. కానీ దానిని సద్వినియోగము చెయ్యక పోవడము మాత్రము తప్పు.
ఇక భగవంతుడి పేరు మీద ఎన్ని వాడబడుతున్నవి. భగవంతుడు ఎప్పుడయినా ఎవరినయినా నాకు ఇన్ని పూల మాలలు కావాలని అడిగాడా? మనస్సుతో సమర్పించే ఒక పుష్పము చాలదా? మనస్సుని పుష్పములాగా సున్నితముగా మర్చి సమర్పించితే భగవాన్ కు మరింత సంతోషము కాదా? పత్రం, ఫలం, పుష్పం, తోయం, అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు గీతలో. దాని అర్థమేమిటి అని ఎన్నడయినా ఒక క్షణము ఆలోచిస్తే ఇంత మారణ కాండ జరుగదు. ఉదయము కొన్నిదండలు, సాయంత్రము కొన్ని దండలు. దండలు మాని దండాలు పెడితే చాలదా అని ఆలోచించవచ్చును కదా. పువ్వు పుట్టిన దగ్గరనుండి రాలిపోవటానికి కొన్నిగంగంటలు లేదా కొన్ని రోజులు మాత్రమే. కొన్ని గంటల తరువాతనో, లేదా ఒకరోజు తరువాత అవి చెత్త కుండీలోకి చేరి పోతవి. దాని మధ్యలో మనము దానిని వధ చేసి, చిత్రహింస చేసి, ఉరి వేసి అలంకారానికి ఉపయోగిస్తాము. ఇదే హింస మనిషికి మనిషి చేసినప్పుడు పెద్ద గోల జరుగుతుంది. కానీ వాటికి నోరు లేదు, వార్తా పత్రికల వాళ్ళు కానీ, టీవీ మనుష్యులను కానీ పిలవలేవు కదా వాటిగోల ఎవ్వరికి వినపడదు, వాటి కన్నీళ్లు ఎవరికీ కనపడవు. దేశములో నాలుగుమూలలా ఇదే పద్ధతి జరుగుతున్నదా అని ఎవరయ్యిన నన్ను ప్రశ్నిస్తే ఏమో నాకు తెలియదంటాను. నాకు తెలిసింది, నేను చూసింది మాత్రమే నేను వ్రాస్తున్నాను. ఉత్తర భారతములో నేను చూసిన రోజుల్లో, స్త్రీలు పువ్వులు తలలో ధరించేవారు కాదు. నా చిన్నతనములో పెళ్లిళ్లు, లేదా మరొక కార్యక్రమములో ఇన్ని దండలు వాడడము నేను చూడలేదు. తోటలు పెంచడము మంచిదే. ఎందుకంటే పువ్వులు అందరికి ఆహ్లాదం కలిగిస్తవి. వాటిని చూసి సంతోషించలేని వాని మనస్సులో ఏముందో సృష్టికర్తకు తెలియాలి. ఈరోజుల్లో ఎవరి ఇంట్లో వాళ్లు తోటలు పెంచుకొనేటంత చోటు లేదు కనుక జనావళికి అందరికి అందుబాటులో ఉండేటట్లుగా పెంచితే అందరు ఆనందించడమే కాకుండా మిగతా జీవరాశులకు కూడా ఆధారమవుతుంది(Ecology).
సన్యాసులకు నియమము పువ్వులు కొయ్యరాదని ఎందుకంటే అది జీవహింస కనుక. భగవంతుని దృష్టిలో అది జీవహింస అయితే మరి మనము అందరమూ చేస్తున్న పని ఏమిటి? సన్యాసులకు, సంసారులకు కొన్నినియమములు వేరే వుండటము సహజము, ఉండాలి కూడాను. కానీ ఈవిషయములో జీవహింస జీవహింసయే కనుక తేడావుండకూడదు. శివమానస పూజలో చెప్పినదేమిటి? మనస్సులోనే కార్య్రక్రమమంతా జరుగుతుంది. శివుడు కాకపోతే విష్ణువు, కృష్ణుడు, రాముడు. ఏ పేరయితే ఏముంది? అన్నీ భగవానుని రూపాలే కదా?
జీవహింస పేరు మీద జీవకారుణ్య సమాజములు వగయిరా నడిపిస్తారు జనులు. మాంసాహారము మానివేస్తాడు. మంచిదే. అదే దయ మొక్కలకు, పువ్వులకు కూడా వర్తింప చేస్తే మరింత సంతోషించ వలిసినదే.
మరి భారత దేశము కాకుండా విదేశాలలోనో అంటే, తోటలు పెంచుతారు. చూసి సంతోషిస్తారు. కొన్ని పువ్వులు ఇంట్లో అలంకారానికి వాడుతారు కొంతమంది మాత్రమే. అవి కూడా ఏ రకానికి చెందినవి అనే దానిని పట్టి, వాతావరణము మూలముగా కానీ, ఒక్క సారి పెడితే కనీసము వారము లేదా పది పన్నెండు రోజులు మన్నుతవి. కనుక విధ్వంసకాండ తక్కువ. శాస్త్రజ్ఞులు కొన్ని సాధనములు వాడి, మనము మొక్కల దగ్గరకు ప్రేమతో వెళ్ళితే ఎలా స్పందించినవో, దానిని నాశనము చెయ్యటానికి లేదా పెరికి వెయ్యటానికి వెళ్ళినప్పుడు ఎలా స్పందించినవి అనే విషయము మీద పరిశోధన చేసి వాటికి బాధ కలుగుతుందని, అవి స్పందించుతవని కనుగొన్నారు. అంగట్లో అన్నీ వున్నవి కానీ అల్లుడి నోట్లో శని ఉన్నదన్నట్లుగా, విషయాలన్నీ గ్రంధాలలో మాత్రమే ఉంచి మనము చేసే విధ్వంసము మనము చెయ్యటమే ప్రస్తుతము జరుగుతున్నది.
మరొక్క మాట ఏమంటే, పువ్వులు తృంపే ముందు ఎవరయినా, మొక్క వేపు చూసి, దానికి క్షమాపణ చెప్పి, దానికి కారణము తెలిపి కోస్తే, మొక్కలు అర్ధము చేసుకోగలవు. పువ్వులు భగవంతుని పూజకు వెళుతున్నామని సంతోషముగానూ ఉండొచ్చు. తమ జీవితము చరితార్ధమయినట్లుగా భావించవచ్చు. చెట్టు కొమ్మనరికేటప్పుడు, చెట్టుకు నమస్కరించి, దానికి నీళ్లు పోసి, ఫలానా యజ్ఞ కార్యముకోసము(విశ్వమునకు మేలు జరగటానికి), కొమ్మ నరుకుతున్నామని చెప్పి చెయ్యమని వేదములలో కూడా వుంది. కనుక ఇదివేద సమ్మతమయినదే. వేద బాహ్యులకు చెప్పగలిగినదేమి లేదు.
ఏది ఏమయినా ఇవన్నీ సున్నితమయిన మనస్సు వున్న వాళ్లే అర్ధము చేసుకో గలరు. అర్ధము చేసికొన్నవాళ్ళు ఆలోచించ గలుగుతారు. ఆలోచించిన వాళ్ళు కొన్నిసార్లు అయినా ఆచరించగలుగుతారు. భిన్నలోకే భిన్న రుచి. ప్రపంచములో ఎంతోమంది మానవులు. వారితలలలో ఎన్నో ఆలోచనలు. నా తలలో ఆలోచనలు ఇవి. వినగలిగిన వాళ్ళు వినండి.