నా ప్రార్ధన

హే ప్రభూ, నిన్ను ప్రార్ధించాలంటే నీ పేరేమిటో నాకు తెలియదు. నీకు కోట్లాది కోట్లు పేర్లుంటే ఏ పేరు ఎంచుకుంటే నీవు పలుకుతావో తెలియదు. నీ కోసము వెదుకుదామంటే విశ్వవ్యాప్తముగా వున్న నిన్ను వెదకడము నాకు సాధ్యము కాదు. పోనీ ఎలాగో వెదికి పట్టుకుందామంటే నీవు ఎలావుంటావో తెలియదు. మరి ఏది నాకు మార్గము?

సృష్టికి అభిన్న నిమిత్త ఉపాదాన కారణము నీవే కదా!(భ.గీ 14.4)అంటే నాకు తల్లి తండ్రి నీవేకదా. నా తల్లి అంటే నాకు ఇష్టము లేదు ప్రభూ. ఎందుకంటే ఆమె త్రిగుణాత్మకమయిన మాయాదేవి కదా. నా పైన ఆమె ప్రేమ అంతా కపట ప్రేమ, సవతి తల్లి ప్రేమ లాంటిది మాత్రమే. ఆమె గుణములు కేవలము మమతలను, మొహాన్ని నాలో పెంచుతున్నవి. చెడు అలవాట్లు పెంచి మహిమ అయిన నా తండ్రిని చూడకుండా చేస్తోంది. మరి నీవేమో
దైవీ హ్యేషా గుణమయీ మమమయా దురత్యయా |
మమేవాయే ప్రపద్యన్తే మాయామేతం తరంతితే || (భ.గీ 7.14)
అంటూ పాడుతూ కూర్చున్నావు.
అర్ధము: నా మాయ త్రిగుణాత్మకమైనది. ఇది అధిగమించుటకు సాధ్యము కానిది. కానీ కేవలము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సాగరమునుండి బయట పడగలరు.) కూర్చున్నావో, నిలబడ్డావో నాకేమి తెలుసులే! అయినా త్రివిక్రముడవైన నీకు కూర్చోడానికి చోటెక్కడున్నది? నా దగ్గరకొస్తే నా హృదయములోనే ఒక సింహాసనము వేస్తాను నీకు.

బిడ్డ మలినములో దొర్లుతూ శుధ్ధి చేసికోడము తెలియక ఏడుస్తూ ఉంటే తల్లి వచ్చి శుధ్ధి చేసి, భుజాన వేసికొని లాలిస్తుంది. ఏడుపు ఆగిపోతుంది. నా మనస్సులో వున్న మాలిన్యము ఆవిడే సృష్టిస్తోంది కనుక ఆమె నన్ను శుభ్రము చేయదు. ఈ మాయాదేవికి మురికి ఇంకా పెంచడమే తెలుసు. కనుక నేను నా తండ్రిపై ఆధారపడివున్నాను. నన్ను శుధ్ధి చేసి నీలో విలీనము చేసికో ప్రభూ! అదే, నన్ను నీ భుజాన వేసికొని లాలించమంటున్నాను.

దేహములో వున్న మనస్సు దేహానికి అంటరానితనం నేర్పింది. కానీ ఇది పిచ్చిమనస్సు ప్రభూ! అంటరానితనం కావలసింది తనకు గాని దేహానికి కాదు కదా. ప్రపంచ విషయాలన్నీ అంటించుకొని కుమిలిపోయేది అదే కదా. ఇది వదిలించుకోమని చెప్పవలసిన బుద్ధి లేదా దానిలో వెలిగే జ్ఞానము నీవే కదా ప్రభూ? మరి జాప్యమెందుకు? అలిగావా నాపైన? మరి నీ అలక తీర్చేదెలా? కంటికి కనిపించవు. చెవికి వినిపించవు. మనస్సుకు అందవు. బుద్ధిలో అహంకారము నిండి అంధకారము సృష్టించింది. నిన్ను కనపడకుండా చేసింది. మరి ఈ అహంకారములో వున్న కారము తగ్గించు ప్రభూ. దేహము ఉన్నంత కాలము దాని మనుగడ కోసము బహు కొద్దిగా కారము వుండనీ. కానీ దానిని కూడా అత్యవసరమైనప్పుడే వాడుకునేటట్లుగా నేర్పించు నాకు. నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమే అని గ్రహించి ఆ స్థితిలో నిలిచి వుండనీ భగవాన్.

ఆ స్థితిలో నేనున్నపుడు నేను నీకు దూరముగా లేను కదా! నిన్నుఎక్కడో వెదకవలసిన అవసరము లేదు కదా. నిన్ను గొంతెత్తి పిలవవలసిన పని అసలే లేదు. నేను నీవై మిగిలిపోతాను. తల్లి బారినుండి విడిపడి తండ్రి దగ్గర వుండాలని నా ఆకాంక్ష. కనికరించు మరి!

ఇదే నా విన్నపము. ఇదే కనపడని వినపడని(నిరాకార నిర్గుణ స్వరూపుడవైన) నీకు నా ప్రార్ధన. మరి నా విన్నపము చిత్తు బుట్టలో పడెయ్యొద్దు సుమా!

త్వమేవ శరణం మమదేవ దేవం. పాహిమాం ప్రభో.