Telugu Essays 1-20
- 1. పలకలేని వాళ్ళు పలికితే ఎలావుంటుంది
- 2. అందము ఆనందము
- 3. అసంగత్వము
- 4. ఒక అనామిక ఆక్రందనము
- 5. పెద్దల సుద్దులు
- 6. కడుపే కైలాసము, ఇల్లే వైకుంఠము
- 7. భయము
- 8. మార్పు
- 9. ముహుర్తములు ఏమిటి ఎందుకు అవసరమా
- 10. ముక్తి
- 11. వామన మూర్తి - పౌరాణిక దృష్టి, తాత్విక దృష్టి
- 12. ఒక సుమబాల గోల
- 13. చావు ఎవరినీ చంపదు
- 14. కృష్ణుణ్ణి అర్ధము చేసికోవటం ఎలా ? ఇలా !!
- 15. గ్రహములు మంచివా, చెడ్డవా?
- 16. నేనెవరిని
- 17. నేను చేసానా లేక అది జరిగినదా?
- 18. వైరుధ్యములో దాగిన సత్యము
- 19. పాల సముద్రము/ క్షీర సాగరము
- 20. నా ప్రార్ధన
ఒక అనామిక ఆక్రందనము
మమత, మానవత్వము, మృదులత్వముతో శోభించవలసిన ప్రపంచములో వీటికి చోటు లేకుండా పోయింది. మతాలతో మతులు చెరిపి మనిషికి మనిషికి మధ్య మట్టి చల్లి, మానవత్వము మరపించిన జీవసృష్టిలో మనుగడ సాగించేదెలా?
సమత, సామరస్యము, సంగీతము, సాహిత్యము నాట్యము చేసి మానవాళి మనస్సులో సంతోషము నింపవలసిన ఈశ్వర సృష్టి ఎక్కడికి పరుగులు పెట్టింది?
దీనికి కారకులు ఎవరు, కారణము ఏమిటి?
మధురమైన మాధవుడు మృదులమయిన మాటలతో, మనిషి మతిని శృతి చేసే శుభ దినము ఎప్పుడు వస్తుంది? చేస్తే, చేస్తూవుంటే శృతి తప్పిన మతికి వినే శక్తి లోపించిందా? శృతి గీసిన(చతుర్వేదములు) గీతలు, గీతలు(భగవద్గీత, అష్టావక్ర గీత, అవధూత గీత, ఉద్ధవగీత మొదలైన) పాడిన పాటలు వినపడడము లేదా? వినే శక్తిని పూర్తిగా కోల్పోయారా మానవులు?
గతి తప్పిన మతులకు మార్గమేది? మరొకతీరమున్నదని తెలిసినవారెందరు? తెలియచెప్పేవారెందరు? చెప్పినవారిని నమ్మే వారెందరు? నమ్మితే నడిచేవారెందరు? నడిచిన వాళ్లలో చేరేవారెందరు? నమ్మి చెడిన వారెందరు? ఆచరించాలనుకున్న వారికి ఆటంకములు ఎన్ని? వాటిని దాటేదెలా? సహాయము చేసేవారెవ్వరు? ఇది ఈ అనామికకు అనూహ్యము.
పచ్చని కలశములో మేలిమి ముత్యాలు నింపిన పగిది, భారతభూమి మానవులను పశుత్వమునుండి దాటించి మానవత్వము నింపటానికి ఎందరో మహానుభావులను సృష్టించి మహిలోకి పంపింది. వారందరి భావాలు, బోధలు ఎక్కడైనా భూస్థాపితమై పోయినవా? ఈ దురదృష్ట పరిస్థితి నుండి బయట పడేదెలా? బయటకు లాగేవారెవరు?
మరి ఈ పరిస్థుతులలో మనుగడ సాగించడము కంటే, మహిమగా మిగలడము ఉత్తమము కదా! ఇది నివృత్తి కోరిక కాదా భగవాన్?
నాలో వున్న అరిషడ్వార్గాలకు అంతమెప్పుడు? శమదమాదులకు సాంతమెప్పుడు?
వెన్నలో మెత్తదనం, మల్లెలో తెల్లదనం అందుకొనేదెలాగా?
నాలో వున్న ప్రేమ నీకే చేరనీ నాలో వున్న ద్వేషము నీవైపుకే మళ్ళించుకో
నాలో వున్న కాఠిన్యము నీదే. నాలో వున్న కోమలత్వము నీదే.
అన్నీ నీకందించినతరువాత, అన్నీ నీవే అయినప్పుడు నాలో శూన్యమేకదా మిగిలింది? వేణువు లాగా మిగిలిపోనియ్యినన్ను. అన్నీ పోగొట్టుకున్న నన్ను నీ అక్కున చేరనివ్వు. నాహృదయములో నీవుండు. నీలో నన్ను ఒదిగిపోనీ ప్రభూ. నీ అండ నాకుండనీ. నా భక్తి నీకేవుండనీ. భక్తి,జ్ఞానము సమ్మేళనము కానివ్వు. రూపములో వున్న స్వరూపాన్ని చూడనివ్వు నన్ను. ఏకమై, నిత్యమై మిగిలిపోనీ నన్ను. అనాదిగావున్న ఈ చీకటి వెలుగును చూచేదెప్పుడు? నీవు నాలోనే వున్నప్పుడు నాకు చెప్పేవారెవరు? నేనెవరితో గుసగుసలాడాలి? నేను నేనుగా మిగిలేదెప్పుడు? ప్రపంచములో విహరిస్తున్న ఈ పాంచభౌతిక శరీరము వదలి పరంధామము చేరే రోజు ఎప్పుడు భగవాన్?
ప్రభూ, (పరమాత్మ) నేను (జీవాత్మ) నీలో ఐక్యం (సంగమము) అయ్యే రోజు ఎప్పుడు? సంగమ స్థానమెక్కడ?(దేహము వదిలే స్థలము) త్రివేణి సంగమము కోసము ఎదురు చూస్తున్నాను. భగవాన్ నా మనస్సుకు నచ్చిన మాట, నేను నడుస్తున్న బాట, ఇది. ప్రయాణము పూర్తి అయ్యే దెప్పుడు? సంగమము అనే మాట మనస్సుకు ఆనందాన్ని ఇస్తే, సంగమము జరిగినప్పుడు కలిగేది ఆత్మానందమే కదా? ఆ శుభదినము ఎప్పుడు, ఎప్పుడు, ఎప్పుడు? హే పరమాత్మా ఇదే నాశరణాగతి మరి. పాహిమాం పరమేశ్వరా !!